18 June, 2026 | 1:44 AM

వానకాలం సాగుకు ముందస్తు ఏర్పాట్లు చేయండి

18-06-2026 12:00 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి

ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించాలి

నకిలీ విత్తనాల విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి

సమీక్షలో అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం

ఆమనగల్లు, జూన్17 (విజయక్రాంతి): రానున్న వానాకాలం సాగు సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని తన నివాసంలో రంగారెడ్డి జిల్లా ఆమ నగల్, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మం డలాల వ్యవసాయ శాఖ డివిజన్, మండల స్థాయి అధికారులతో ఆయన విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సాగు ప్రారంభానికి ముందే రైతులకు అవసరమైన ఎరువు లు, నాణ్యమైన విత్తనాలు, ఇతర వ్యవసాయ ఇన్పుట్లు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలన్నారు. ఎరువుల కొరత రాకుండా ముందస్తు నిల్వలు ఏర్పాటు చేసి, పంపిణీ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

ముఖ్యంగా నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువుల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.వ్యవసాయ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఎమ్మె ల్యే ఆదేశించారు. పంటల ఎంపిక, సాంకేతిక సూచనలు,ఎరువులు-పురుగుమందుల సరైన వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి వానాకాలం సాగు సీజన్ను విజయవంతం చేయాలని కోరారు.  సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులు ఎడిఏ శోభా రాణి,ఏఓలు శ్రీనివాస్ గౌడ్, అరుణ, అనిత, రేణుకా చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.