వీవోఏ, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా..
- ఉద్యోగ, కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
- ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు మొగుళ్ళ రాజి రెడ్డి
ముషీరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న వివోఏ, ఉపాధి హామీ ఫీల్ అసిస్టెంట్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు మొగుళ్ళ రాజిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ నారాయణగూడ ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ఐకేపి వివోఏ సంఘం (ఐఎన్టీయూసీ), తెలంగాణ రాష్ట్ర ఉపాధి హామీ ఫీల్ అసిస్టెంట్ల యూనియన్ (ఐఎన్టీయూసీ) ల సంయుక్త ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి మొగుళ్ళ రాజిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత ఉద్యోగ, కార్మికుల సంక్షేమాన్ని కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, ఆర్టీసీ కార్మికుల సమస్యలు, జలమండలి కార్మికుల సమస్యలు పరిష్కరించడంతో పాటు రాష్ట్రంలో ఉద్యోగ, కార్మికులకు కనీస వేతనాలు పెంచిందని తెలిపారు.
ఐకేపి వివోఏ లకు సమాన పనికి సమాన వేతనం నెలకు 26 వేలు, ఉద్యోగ భద్రత, భీమా వంటి న్యాయమైన కోరికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని మొగుళ్ళ రాజిరెడ్డి హామీ ఇచ్చారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. నాగన్న గౌడ్ మాట్లాడుతూ గతంలో సమ్మె చేసిన వందలాది మంది ఉపాధి హామీ ఫీల్ అసిస్టెంట్లను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొలిగించిందని, దీనిపై ఐఎన్టీయూసీ రాష్ట్ర హై కోర్టులో దావా వేసి తొలగించిన ఫీల్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని ఆర్డర్ ను తీసుకవచ్చిందని గుర్తు చేసారు.
ఉపాధి హామీ ఫీల్ అసిస్టెంట్లకు కనీస వేతనం నెలకు 26 వేలు, ఉద్యోగ భద్రత తోపాటు ఎఫ్.టి.ఈ వంటి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.పి. రాఘవేంద్ర రాజ్, తెలంగాణ రాష్ట్ర ఐకేపి వివోఏ సంఘం అధ్యక్షులు పి. అరుణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎన్. ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర ఉపాధి హామీ ఫీల్ అసిస్టెంట్ల యూనియన్ అధ్యక్షులు బి. రవి, ప్రధాన కార్యదర్శి సిద్ది రాజు, నాయకులూ గోలి శ్రావణి రెడ్డి, కవిత, శరత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.






