22 August, 2026 | 7:50 PM

ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి

22-08-2026 06:36 PM

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 6 నుంచి 8వ తేదీ వరకు కరీంనగర్‌లో నిర్వహించనున్న మహాసభలకు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అన్ని విభాగాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. శనివారం ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోలో కార్మికులతో కలిసి మహాసభల వాల్ పోస్టర్లను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31న ఆవిర్భవించి, నాటి నుంచి నేటి వరకు కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు, త్యాగాలు చేసిందన్నారు. కార్మికులు, కర్షకులను ఐక్యం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆయన ఆరోపించారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి, 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

ESI, గ్రాట్యుటీలపై ఉన్న సీలింగ్‌ను ఎత్తివేయాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులపై జరుగుతున్న వేధింపులను వెంటనే నిలిపివేయాలని కోరారు.కరీంనగర్‌లో జరిగే మహాసభలకు ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్‌తో పాటు దేశ, రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారని తెలిపారు. జిల్లాలోని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కార్మికులు నరేష్, ఆర్పీ సింగ్, నారాయణ, షఫీ, హైమద్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.