అప్పుల బాధతో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
సిద్దిపేట రూరల్, ఏప్రిల్ 21: అప్పుల బాధతో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని చింతమడక గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. రూరల్ ఎస్త్స్ర రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పెద్దేల్లిగారి నాగరాజు (43) అప్పులు చేసి తనకు ఉన్న మూడు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకునేందుకు మూడు బోర్లు వేసినప్పటికీ, అవి పడకపోవడంతో, జెసిబి కొనుక్కున్నాడు.
అది కూడా సరిగ్గా నడవకపోవడంతో ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం అప్పుల విషయమై భార్య లావణ్య తో గొడవ జరగగా, నాగరాజు తన భార్యను ఇంట్లో నుండి వెళ్లగొట్టడు. అప్పుల విషయమై బాధపడుతున్న అతను సోమవారం జీవితం పై విరక్తి చెంది, ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఉరి వేసుకొని చనిపోయాడు. మృతునికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉండగా, మృతుని భార్య లావణ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్త్స్ర తెలిపారు.






