లులూ మాల్‌లో రివాల్వర్‌తో ఒకరు హల్‌చల్!
- గర్తించని భద్రతా సిబ్బంది
- యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు
- కేపీహెచ్‌బీ కాలనీలోని మాల్‌లో ఘటన
కూకట్ పల్లి, జులై 14,( విజయ క్రాంతి): కేపీహెచ్‌బీ కాలనీ లులూ మాల్ లోకి ఓ వ్యక్తి లైసెన్స్ రివాల్వర్ తో ప్రవేశించిన ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పాతబస్తీకి చెందిన సిద్ధికి గచ్చిబౌలిలోని ఓ ఫైరింగ్ అకాడమీలో షూటింగ్ శిక్షణ పొందుతున్నాడు. సోమవారం రాత్రి అతని సన్నిహితులు కొందరు లులూ మాల్‌లో షాపింగ్ చేస్తున్నారని, వారికి కొంత డబ్బు అవసరం ఉందని తెలిసి ఇవ్వడానికి సిద్ధికి మాల్ లోకి ప్రవేశించాడు.
అయితే లోనికి వచ్చే సమయంలో అతని వద్ద తన లైసెన్సు రివాల్వర్ ఉన్నా భద్రతా సిబ్బంది గుర్తించలేదు. తిరిగి వస్తున్న సమయంలో భద్రతా సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా మరోక కథనం సిద్ధికి మాల్ పార్కింగ్ స్థలంలో హల్‌చల్ చేసినట్టు తెలిసింది. పార్కింగ్ స్థలంలో ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవలో సిద్ధికి అత్యుత్సాహం చూపుతున్న సమయంలో మాల్ భద్రతా సిబ్బంది అతని వద్ద రివాల్వర్ ఉన్నట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు సిద్ధికి వద్ద గల రివాల్వర్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ రివాల్వర్ కు లైసెన్స్ ఉన్నట్టు గుర్తించారు. మాల్ లోకి రివాల్వర్ తీసుకొని వెళ్లే సమయంలో భద్రతా సిబ్బంది లోపం ఉన్నట్టు పోలీసులు గుర్తించి యాజమాన్యంపై కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది.






