శర్వా సరసన..?
టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ఇటీవలే ‘బైకర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ప్రస్తుతం దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న యాక్షన్ డ్రామా ‘భోగి’ కోసం పనిచేస్తున్నారు. ఈ సినిమా పట్టాలపై ఉండగానే శర్వానంద్ తన తదుపరి ప్రాజెక్టును టాలీవుడ్ సీనియర్ దర్శకుడు శ్రీనువైట్లతో ఖరారైనట్టు తెలుస్తోంది. శ్రీనువైట్ల మార్క్ కామెడీకి, విభిన్నమైన టైమ్ ట్రావెల్ కాన్సెప్టును జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ తుది దశలో ఉందని సమాచారం. జులై నుంచి షూటింగ్ ప్రారంభించి, వచ్చే సం క్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. అయి తే, ఈ సినిమాలో శర్వానంద్ సరసన నటించే హీరోయిన్ విషయంలో కొన్ని రోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు పూజా హెగ్దే, మమిత బైజు స్టార్ భామల పేర్లు వినిపించాయి. ఇప్పుడు మానస వారణాసిని టీమ్ ఎంపిక చేసిందన్న టాక్ వినవస్తోంది. ఇటీవల ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ శర్వా లాంటి స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేయడం ఆసక్తిని రేకెత్తిస్త్తోంది.






