పెద్ది సినిమాతో మాకేం సంబంధం?
“అటు తిప్పి ఇటు తిప్పి ‘పెద్ద’ సినిమా ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ ‘పెద్ది’ సినిమాతో మాకు ఎలాంటి సంబంధం లేదు” అంటూ నిర్మాతలపై మండిపడుతున్నారు ‘తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’, ‘తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్’ బాధ్యులు! ఒకవైపు సింగిల్ స్క్రీన్లలో పూర్తిస్థాయి పర్సంటేజీ విధానాన్ని తెలంగాణ ఎగ్జిబిటర్లు కోరుతుంటే.. మరోవైపు అది కష్టమంటూ తేల్చి చెప్పేస్తున్నారు నిర్మాతలు. ఈ క్రమంలో మీడియా ముఖంగా పరస్పర దూషణకు దిగుతుండటం, ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుకుం టున్న తీరు టాలీవుడ్‌లో హాటాపిక్‌గా మారింది.
ఈ నేపథ్యంలో గురువారం తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాం బర్ ఆఫ్ కామర్స్ (టీఎస్‌ఎఫ్‌సీసీ) మరోమారు మీడియాతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశానికి టీఎస్‌ఎఫ్‌సీసీ కార్యదర్శి శ్రీధర్, నిర్మాత సీ కల్యాణ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. “తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో భాగంగానే మొన్న ఎగ్జిబిటర్ల ప్రెస్‌మీట్ జరిగింది. పర్సంటేజీ విధానం కోసం మేం 2008 నుంచి పోరాడుతున్నాం.
నిరుడు కూడా అడిగాం.. పెద్ద సినిమా ‘హరిహర వీరమల్లు’ విడుదల సమయంలో ఇలా చేయొద్దని, రెండు నెలల్లో చర్చిద్దామని చెప్పారు. ఆ తర్వాత నెలలు గడుస్తున్నా స్పందనలేదు. అందుకే మళ్లీ అడుగుతున్నాం. అనవసరంగా కొందరు నిర్మాతలు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. వారు ఎప్పుడు చర్చలకు పిలిచినా మేం సిద్ధమే. రేపు (మే 15) ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం” అని తెలిపారు. ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో శుక్రవారం జరగబోయే సమావేశంలో సమస్య పరిష్కారానికి తొలి అడుగు పడుతుంది. వీటన్నింటి కన్నా ముఖ్యంగా ప్రేక్షకుడికి సినిమాను ఎలా చేరువ చేయాలన్న దాని గురించి ఆలోచించాలి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లది ఒకే కుటుంబం. వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదు’ అని సీ కల్యా ణ్ సూచించారు.






