7 May, 2026 | 1:29 AM

బెంగాల్‌లో అనేక ప్రశ్నలు!

07-05-2026 12:00 AM

దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎలక్షన్లు ముగిసి, ఫలితాలు వెలువడినా ఇంకా ఎన్నికల వేడి మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా మొదటినుంచీ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య ఎన్నికల ప్రక్రియపై ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇందుకు ప్రధాన కారణమని చెప్పక తప్పదు.

అయితే, ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను సంస్కరించడం కొత్తే విషయమేమీ కాదు. కానీ, గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా, ఎన్నికలు జరిగిన మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఒక్క పశ్చిమ బెంగాల్‌పైనే ప్రత్యేకంగా దృష్టిసారించడం టీఎంసీ ఆరోపణలు, అనుమానాలకు కారణమైంది.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 లక్షల ఓట్లను తొలగించినట్టు ఆరోపణలు రావడం; వివిధ ట్రిబ్యునళ్ల ముందు విచారణలో ఉన్న 30 లక్షలకు పైగా పిటిషన్లు అతీగతీ లేకపోవడం; టీఎంసీ, కాంగ్రెస్ కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక నియోజకవర్గాల్లో 25 శాతం ఓట్లు తొలిగించారనే ఆరోపణలు రావడం సాధారణ విషయమేమీ కాదు. సర్ రూపంలో విపక్ష పాలిత రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకుందని, ఇది ప్రజాస్వామ్యానికి, తమకు మరణశాసనం లాంటిదని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేయడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది.

ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేసేదే లేదని మమతాబెనర్జీ భీష్మించుకు కూర్చోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలను గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పిన దీదీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని ఎంతమాత్రమూ అంగీకరించడం లేదు.

ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము బీజేపీతో మాత్రమే పోరాడలేదని, ఆ పార్టీ కోసం పనిచేసిన ఎన్నికల కమిషన్‌తోనూ పోరాడామని మమతాబెనర్జీ చేసిన తీవ్రమైన ఆరోపణలపై సర్వత్రా చర్చ జరుగుతున్నది.

అయితే, దీదీ ఆరోపణలను ఎన్నికల్లో భారీ విజయం సాధించిన బీజేపీ కొట్టిపారేయడం గమనార్హం. ఇరుపక్షాల వాదనలు ఎలా ఉన్నా అనేక అనుమానా లు, సందేహాలు, ప్రశ్నలకు వేదికగా మారిన ఈ ఎన్నికలు వాటిన్నింటిని నివృత్తి చేయకుండానే ముగియడం ప్రజాస్వామ్యం ఉనికి, మనుగడకు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు.