లోక్‌భవన్‌కు మరో పరీక్ష!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి మూడు రోజులైనప్పటికీ, ఇంకా ఆ రాష్ట్ర అధికార ‘పీఠ’ముడి వీడటం లేదు. 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించకపోవడంతో తమిళనాట రాజకీయ సంక్షోభం ఏర్పడింది. మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతోనే టీవీకే అధినేత విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదని లోక్‌భవన్ ఇచ్చిన ప్రకటనతో ఈ వివాదం రాజ్యాంగ సంక్షోభానికి దారితీసింది.
లోక్‌భవన్ ప్రకటన నేపథ్యంలో 1994 నాటి ఎస్‌ఆర్ బొమ్ము వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పు మరోసారి చర్చకు వస్తోంది. ‘ప్రభుత్వానికి మెజారిటీ ఉందా, లేదా? అనేది తేలాల్సింది లోక్‌భవన్‌లో కాదు, అసెంబ్లీలో’ అని సర్వోన్నత న్యాయస్థానం నాడు స్పష్టం చేసింది. కానీ, అందుకు విరుద్ధంగా తమిళనాడు లోక్‌భవన్ నుంచి ప్రకటన వెలువడటం గమనార్హం.
వాస్తవానికి ఎవరికీ మెజారిటీ రాకపోతే ఎన్నికలకు ముందే ఏర్పడిన సంకీర్ణ పక్షాన్ని తొలుత, అలాంటి సంకీర్ణాలు లేనిపక్షంలో ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీని గవర్నర్ ఆహ్వానించడం సంప్రదాయం. అయితే, ఈ విషయంలో గవర్నర్లకు మన రాజ్యాంగం కొన్ని విచక్షణాధికారాలూ కట్టబెట్టింది. ఇక్కడే అసలు సమస్య ఉత్పన్నమవుతోంది. గవర్నర్లు రాష్ట్రానికో రీతిలో, సందర్భానికో తీరులో నిర్ణయాలు తీసుకోవడం మొదటినుంచీ దేశంలో వివాదాస్పదమవుతోంది. 2017లో గోవా ఎన్నికల్లో 17 సీట్లతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా, 13 స్థానాలు గెలిచిన బీజేపీని అప్పటి గవర్నర్ మృధులా సిన్హా ఆహ్వానించడంపై అప్పట్లో వివాదం చెలరేగింది.
అదే ఏడాది మణిపూర్‌లో 28 సీట్లు గెలిచిన కాంగ్రెస్‌ను కాదని, 21 స్థానాల్లో గెలిచిన బీజేపీని గవర్నర్ నజ్మా హెప్తుల్లా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వడంపైనా చర్చోపచర్చలు జరిగాయి. ఆ తర్వాతి ఏడాది కర్ణాటకలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. నాటి గవర్నర్ వాజుభాయ్ వాలా 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ నేత యడియూరప్పతో ప్రమాణం చేయించారు. అయితే, సుప్రీంకోర్టు జోక్యంతో బలపరీక్షకు ముందే యడియూరప్ప సర్కార్ కుప్పకూలిపోవడం వేరే విషయం. కాగా, తమిళనాడు రూపంలో గవర్నర్ వ్యవస్థ మరోసారి పరీక్షను ఎదుర్కొంటున్నది. రాజ్యాంగ విలువలను కాపాడుతూ లోక్‌భవన్ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెడుతుందో, రాజకీయ పక్షాలతో కలబడుతుందో చూడాలి.






