కిరాణా దుకాణంలో గంజాయి
- నానక్‌రాంగూడలో అమ్ముతున్న లేడీ డాన్ నీతూ భాయ్
- సేవిస్తున్న 50 మంది ఐటీ ఉద్యోగులు అరెస్టు
శేరిలింగంపల్లి, జూన్ 10 (విజయక్రాంతి): ఐటీ హబ్ నానక్‌రాంగూడలో గంజాయి మహమ్మారిపై ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. కిరాణా షాపు ముసుగులో సాగుతున్న లక్షల రూపాయల గంజాయి నెట్‌వర్క్‌ను అధికారులు ఛేదించారు. ఈ మెరుపు దాడుల్లో గంజాయి కొనుగోలు చేస్తూ, సేవిస్తూ ఉన్న సుమారు 50 మంది ఐటీ ఉద్యోగులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
ధూల్‌పేట్ నుంచి వచ్చి నానక్‌రాంగూడలో స్థావరం ఏర్పరచుకున్న లేడీ డ్రగ్ డాన్ నీతూ భాయ్ ఈ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ గుర్తించింది. సాధారణ కిరాణా షాపు రూపంలో రోజుకు 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు గంజాయి, డ్రగ్స్ విక్రయా లు సాగిస్తున్నట్లు నిఘా విభాగం ఆధారాలతో నిరూపించింది. ఈ దందా ప్రధానంగా గచ్చిబౌలి, మాదాపూర్, నానక్‌రాం గూడ పరిధిలోని మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే నైట్ షిఫ్ట్ ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని సాగుతోంది.
పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఈగల్ ఫోర్స్ బృందాలు నీతూ భాయ్ నివా సం, కిరాణా షాపును ఒకేసారి చుట్టుముట్టాయి. ఒక్క గంటలోనే అక్కడ గంజాయి కొంటున్న ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారంతా ఐటీ ఉద్యోగులే. నీతూ భాయ్‌పై గతంలోనే అక్రమ దందా కేసులు ఉండటంతో పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్ట్ చేశారు.
జైలు నుంచి బెయిల్‌పై విడుదలై ఐటీ కారిడార్‌లో గంజాయి వ్యాపారాన్ని మొదలుపెట్టింది. ఈగల్ ఫోర్స్ దాడుల ముందస్తు సమాచారం తో నీతూ భాయ్ తృటిలో తప్పించుకుని పరారైంది. ఆమె కోసం నానక్‌రాంగూడలోనే మకాం వేసి ప్రత్యేక బృందాలతో వేట కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.






