5 June, 2026 | 12:53 AM

ప్రకృతితో మమేకమైతేనే మనుగడ

05-06-2026 12:00 AM

జూన్ నెల ఆరంభంలోనే దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నాయి. హిమాలయాల్లో హిమనదులు వెనక్కి తగ్గుతుండగా, తీరప్రాంతాల్లో సముద్రం నెమ్మదిగా భూమిని ఆక్రమిస్తోంది. ఒకప్పుడు శతాబ్దానికి ఒకసారి సంభవించే ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు తరచూ కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులు ఇక శాస్త్రవేత్తల హెచ్చరిక కాదు. ప్రజల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తున్న వాస్తవం. అందుకే ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎంచుకున్న ‘ప్రకృతి స్ఫూర్తిగా వాతావరణ రక్షణ కోసం’ అనే థీమ్ ఒక నినాదం కంటే ఎక్కువ. ప్రకృతిని జయించాలనే ఆలోచన నుంచి, ప్రకృతిని అర్థం చేసుకుని దానితో కలిసి జీవించాల్సిన అవసరాన్ని గుర్తుచేసే సందేశం ఇది. 

పారిశ్రామిక విప్లవం తర్వాత అభివృద్ధి అంటే ప్రకృతిని మార్చడమే అన్న భావన బలపడింది. ఈ క్రమంలో నదులను కట్టడి చేశాం. అడవులను నరికాం. చిత్తడి నేలలను నిర్మాణ ప్రాంతాలుగా మార్చాం. కొండలను తవ్వి రహదారులు వేశాం. ఇవన్నీ అభివృద్ధికి తోడ్పడినా, ప్రకృతి వ్యవస్థల సహజ సమతు ల్యతను దెబ్బతీశాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ సంక్షో భం వాటి ఫలితమే. ప్రపంచ భూభాగంలో 2.4 శాతం విస్తీర్ణమే కలిగి ఉన్న మన దేశం ప్రపంచ జనాభాలో దాదాపు 18 శాతం మందికి ఆశ్రయం ఇస్తోంది.

పరిమిత సహజ వనరులపై ఇంత భారీ జనాభా ఆధారపడుతున్న నేపథ్యంలో పర్యావరణ ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భారత అటవీ స్థితి నివేదిక 2023 ప్రకారం దేశంలోని అటవీ, వృక్ష సంపద కలిపి 8.27 లక్షల చదరపు కిలోమీటర్లకు చేరుకుంది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 25.17 శాతం. గత రెండేళ్లలో 1,445 చదరపు కిలోమీటర్ల పెరుగుదల నమోదైంది. ఈ గణాంకం ఆశాజనకంగా కనిపించినప్పటికీ, జాతీయ అటవీ విధానం నిర్దేశించిన 33 శాతం లక్ష్యానికి ఇంకా దూరంగానే ఉన్నాం.

దేశంలోని సుమారు 60 కోట్ల మంది ప్రజలు నీటి ఒత్తిడి ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వర్షాకాలంలో నీటమునిగే నగరాలే, వేసవిలో ట్యాంకర్ల కోసం క్యూలో నిలబడుతున్నాయి. ఇది ప్రకృ తి వ్యవస్థలను నిర్లక్ష్యం చేసిన అభివృద్ధి నమూనా ఫలితం. 2050 నాటికి భారత జనాభాలో సగానికి పైగా ప్రజలు పట్టణాల్లో నివసించే అవకాశం ఉందని ఐరాస అంచనా వేస్తోంది. కానీ మన పట్టణీకరణ ప్రకృతి వ్యవస్థలతో సమన్వయంగా సాగడం లేదు. ఒకప్పుడు వర్షపు నీటిని నిల్వ చేసిన చెరువులు క్రమంగా అదృశ్యమవుతున్నాయి. సహజ జలమార్గాలు ఆక్రమణలకు గురవుతున్నాయి.

ఫలితంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో కొన్ని గంటల వర్షమే భారీ వరదలకు దారితీస్తోంది. అభివృద్ధి కొత్త రూపాలు కూడా కొత్త ప్రశ్నలను ముందుకుతెస్తున్నాయి. డేటా సెంటర్లు, కృత్రిమ మేధస్సు మౌలిక వసతులు, పారిశ్రామిక కారిడార్లు, భారీ సరకు రవాణా కేంద్రాలు దేశ ఆర్థికాభివృద్ధికి అవసరమే. అయితే వీటి కోసం వినియోగించే భూమి, నీరు, విద్యుత్ పరిమాణం కూడా వేగంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రకృతి ఆధారిత పరిష్కారాల ప్రాముఖ్యత మరింత పెరుగుతోంది. వరదల నియంత్రణకు కాంక్రీట్ గోడలు మాత్ర మే సరిపోవు. చెరువులు, చిత్తడి నేలలు కూడా అవసరం. నీటి భద్రతకు భారీ ప్రాజెక్టులే కాదు, భూగర్భ జలాల పునరుత్పత్తి కూడా అవసరం. తీరప్రాంత రక్షణకు సముద్ర గోడలే కాదు, మడ అడవులూ అవసరం.

నెదర్లాండ్స్ వరదలను పూర్తిగా అడ్డుకోవడం సాధ్యం కాదని అంగీకరించి, నదులకు మరింత స్థలం కల్పించే విధానాన్ని అనుసరించింది. చైనా వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే ‘స్పాంజ్ నగరాల’ నమూనాను అభివృద్ధి చేస్తోంది. సింగపూర్ పచ్చదనాన్ని మౌలిక సదుపాయంగా పరిగణిస్తోంది. మన దేశంలోనూ రాజస్థాన్‌లో జోహడ్‌లు, దక్షిణ భారతదేశంలోని చెరువు వ్యవస్థలు, ఒడిశాలో మడ అడవుల సంరక్షణ, తెలంగాణలో మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలు ప్రకృతితో కలిసి పనిచేసే అభివృద్ధి నమూనాలకు ఉదాహరణలు. ప్రపంచం ఇప్పుడు ‘ప్రకృతి ఆధారిత పరిష్కారాలు’గా ప్రచారం చేస్తున్న అనేక భావనలు భారతీయ సమాజంలో శతాబ్దాలుగా ఆచరణలో ఉన్నాయని మర్చిపోకూడదు.

కింజరాపు అమరావతి