19 May, 2026 | 2:41 AM

టెక్ దిగ్గజాలకు భారీషాక్!

19-05-2026 01:27 AM

సముద్ర గర్భంలోని ఇంటర్నెట్ కేబుళ్లపై ఇరాన్ నిఘా

హోర్ముజ్ జలసంధిలోని డిజిటల్ లైన్ల వినియోగంపై పన్ను ప్లాన్

గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ నుంచి వసూళ్లకు కొత్త ప్రణాళికలు

అంతర్జాతీయ చట్టాలను ధిక్కరిస్తూ టెహ్రాన్ అడుగులు

టెహ్రాన్, మే 18: ప్రపంచ టెక్ దిగ్గజాలకు భారీ షాక్ ఇచ్చేలా సముద్రగర్భ ఇంటర్నెట్ వ్యవస్థను తన అదుపులోకి తెచ్చుకోవడానికి ఇరాన్ సరికొత్త వ్యూహాలు పన్నుతోంది. హోర్మూజ్ జలసంధి గుండా వెళ్లే సముద్రగర్భంలోని కేబుళ్లపై ప్రత్యేక రుసుములు వసూలు చేయాలని సిద్ధమవుతోంది.

ఈ జలసంధి కింద ఉన్న అంతర్జాతీయ డిజిటల్ కనెక్టివిటీ లైన్లను ఉపయోగించుకుంటున్నందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి గ్లోబల్ టెక్ సంస్థలపై పన్నులు విధించాలని ఇరాన్ ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ చట్టాలను ధిక్కరిస్తూ టెహ్రాన్ అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఇరాన్ దేశానికి చెందిన అధికారిక మీడియా సంస్థలు సంచలన కథనాలను ప్రచురించాయి. ఈ కొత్త ప్రణాళికల ప్రకారం అంతర్జాతీయ టెక్ కంపెనీలన్నీ ఇరాన్ చట్టాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది.

అలాగే సబ్‌మెరైన్ కేబుల్ ఆపరేటర్లు లైసెన్స్ ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ కంపెనీ అయినా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కేబుళ్లను కట్ చేసి, వాటి డేటా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తామని కూడా ఆ కథనాలు హెచ్చరించాయి. అంతేకాకుండా ఈ కేబుళ్ల నిర్వహణ, మరమ్మతు హక్కులను సైతం ప్రత్యేకంగా ఇరాన్ కంపెనీలకే అప్పగించాలనే ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నారు. అయితే అమెరికా ఆర్థిక ఆంక్షల కారణంగా ఆయా కంపెనీలు నేరుగా ఇరాన్‌కు ఎలాంటి చెల్లింపులు చేసే అవకాశం లేదు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంటర్నెట్, ఆర్థిక లావాదేవీల డేటా ట్రాఫిక్‌కు ఈ సముద్రగర్భ కేబుళ్లే ప్రధాన ఆధారం. ఆసియా డేటా హబ్‌లను, ఐరోపాలోని కేంద్రాలను కలిపే కీలకమైన డిజిటల్ లింకులు ఈ జలసంధి కింద నుంచే వెళ్తున్నాయి. భారతదేశానికి వచ్చే ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో కూడా దీని వాటా చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ ఇరాన్ చర్యల వల్ల ఈ కేబుళ్లకు స్వల్ప నష్టం జరిగినా బ్యాంకింగ్ వ్యవస్థలు, మిలిటరీ కమ్యూనికేషన్స్, కృత్రిమ మేధ రంగాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

అంతర్జాతీయ తీరప్రాంత చట్టాల ప్రకారం తమ ప్రాదేశిక జలాల్లోని కేబుళ్లకు షరతులు విధించే హక్కు ఆ దేశాలకు ఉంటుంది. ఈజిప్ట్ దేశం సూయజ్ కాలువ మీదుగా వెళ్లే కేబుళ్లకు లైసెన్స్ ఫీజులు వసూలు చేస్తున్న ఉదాహరణను ఇరాన్ ఇక్కడ చూపిస్తోంది. అయితే సూయజ్ కాలువ కృత్రిమంగా నిర్మించినది కాగా, హోర్ముజ్ సహజసిద్ధమైన అంతర్జాతీయ జలసంధి అని నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఇది ఇరాన్ ప్రాదేశిక పరిధి కిందకు రాదని అంతర్జాతీయ చట్టాలు చెబుతున్నప్పటికీ.. టెహ్రాన్ మాత్రం ఈ డిజిటల్ మార్గాన్ని ఒక వ్యూహాత్మక ఆయుధంగా వాడుకోవాలని చూస్తోంది.