16 July, 2026 | 1:37 AM

డీఏలకు కరువు!

16-07-2026 01:29 AM

ఆరుకు చేరిన డీఏ బకాయిలు.. ఉద్యోగుల్లో అసంతృప్తి

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): కరువు భత్యానికి (డీఏ) కరువు వచ్చిపడింది. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యా య, పెన్షనర్లకు రావాల్సిన డీఏలు పేరుకుపోతున్నాయి. ఇప్పుడు అవి ఆరుకు చేరా యి. ఒక శాతం డీఏ ఇస్తేనే ఏడాదికి రూ. 500 కోట్లు వరకు ప్రభుత్వంపై భారం పడుతుంది. మొత్తం ఆరు డీఏలు కలుపుకుంటే 15 శాతం అవుతుంది. ఈ 15 శాతం డీఏ, గత డీఏ బకాయిలు మొత్తం రూ. 10 వేల కోట్లకు పైగానే ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి చెల్లించకుండా ప్రభుత్వం.. ఖజానా వట్టిపోయిం దనే సాకును చెపుతూ, దాటవేస్తున్నదని ఉద్యోగ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. పక్క రాష్ట్రాలు అక్కడి ఉద్యోగులకు క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు డీఏలను చెల్లిస్తున్నాయి. మన రాష్ట్రంలోనే డీఏలు పెండింగ్ పడుతున్నాయని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

ఉద్యోగులపై ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతి ఏటా రెండుసార్లు.. అంటే ఆరు నెలలకోసారి డీఏలు చెల్లిస్తా రు. మూడేళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం డీఏలను పెండింగ్‌లో పెట్టింది. 1-1- 2024 నుంచి 1-7-2026 వరకు మొత్తం ౬ డీఏలను చెల్లించలేదు. 1-1-2024లో 3.64 శాతం డీఏను చెల్లించాల్సి ఉంది.

1-7-2024లో 2.73 శాతం, 1-1- 2025లో 1.82 శాతం, 1-7-2025లో 2.73 శాతం, 1-1-2026లో 1.82 శాతం, 1-7-2026లో 1.82 శాతం డీఏలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ డీఏలతోపాటు, డీఏ బకాయిలు మొత్తం కలిపితే రూ. 10 వేల కోట్ల వరకు ఉద్యోగులకు రావాల్సిఉంది. గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల్లోనే ఈ తరహాగా డీఏలు పెండింగ్ పడుతున్నాయని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. 

ఖజానా ఖాళీ..

కేంద్రం, ఇతర రాష్ట్రాలు 6 నెలలకోసారి డీఏలను విడుదల చేస్తుంటే, తెలంగాణలో మాత్రం బకాయిలు పేరుకుపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆరు నెలలకు ఒక డీఏను ప్రకటిస్తున్నది. మనదగ్గర మాత్రం రెండుమూడేళ్ల వరకు డీఏలు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ప్రభుత్వం వద్ద ఖజానా ఖాళీ.. డబ్బుల్లేవు, వచ్చే ఆదాయానికి వ్యయానికి చాలా తేడా ఉందనే సాకులను ప్రభుత్వం చెప్తున్నదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

అప్పుల చెల్లింపులు, సంక్షేమ పథకాలు, ఉద్యోగులకు చెల్లిస్తున్న బకాయిల విడుదలతో ఇప్పటికే భారం పడుతున్నదని ప్రభుత్వం వాదన.   కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మూడు డీఏలను మాత్రమే చెల్లించింది. ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్న తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డీఏలను చెల్లించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు.