16 July, 2026 | 1:27 AM

ఫ్యూచర్ సిటీలో అగ్రస్థానం అమెజాన్‌దే

16-07-2026 01:26 AM

2034 నాటికి అమెజాన్ లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాలి

  1. జీడీపీలో 10 శాతం వృద్ధికి ప్రణాళికలు సిద్ధం 
  2.   1,500 కోట్లు కోల్పోయినా.. కాలుష్య రహితమే లక్ష్యం
  3. భూములిచ్చిన రైతులను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం 
  4. అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపనలో సీఎం రేవంత్ 
  5. పెట్టుబడుల ఆకర్షణకు, ఉపాధి అవకాశాలకు కీలక మైలురాయి: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్‌దే అగ్రస్థానమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ కంపెనీ శంకుస్థా పన కార్యక్రమం ఫ్యూచర్ సిటీకి వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలకు మంచి ప్రోత్సాహకంగా ఉపయోగపడనుందని తెలిపారు. సింగిల్ విండో విధానం, పారదర్శక అనుమతుల వ్యవస్థ, వేగవంతమైన భూ కేటాయింపులతో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని రాష్ట్ర ప్రభు త్వం కల్పిస్తోందన్నారు.

2034 నాటికి అమెజాన్ సంస్థ లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని ఆకాంక్షించారు. ప్రతి నెలా పరిశ్రమల స్థాపనకు సంబంధించి అన్ని అంశాలపై సమగ్ర రివ్యూ నిర్వహిస్తున్నామని, అమెజాన్ సంస్థ పెట్టుబడులకు సంబంధించి ప్రతి నెలా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ‘తెలంగాణ రైజింగ్-2047‘ లక్ష్యమని చెప్పారు.

వికసిత భారత్-2047 లక్ష్యం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా జాతీయ జీడీపీలో తెలంగాణ తన వాటాను ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి 10 శాతానికి పెంచుకోవాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని వెల్లడించారు. బుధవారం ఫ్యూచర్‌సిటీలో అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... ఫ్యూచర్ సిటీలో అత్యంత అధునాతనమైన నగరాన్ని నిర్మించాలని, ఫార్చ్యూన్--500 కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడానికి 2025 డిసెంబర్‌లో తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి నమూనాగా నిలపాలనే ఆలోచనతో తెలంగాణ రైజింగ్ పాలసీ విధానాన్ని రూపొందించుకున్నామన్నారు. ఉద్యోగ కల్పన కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. 

రైతులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే..

హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీ, ఫార్మా కంపెనీలు, అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ తో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1.34 కోట్ల మంది నివసిస్తున్నారని, ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. నగరంలో ఉన్న పరిశ్రమలను తరలించే అవసరం ఉంది, మూసీ నది ప్రక్షాళన, మెట్రో రైలు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.

మూడు లక్షల ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని, నగరంలో డీజిల్ మీద ఆధారపడి నడుస్తున్న 2 లక్షల ఆటోలను రెట్రో ఫిట్టింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయని వెల్లడించారు.  ప్యూర్, రేర్ ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజించామని, సమగ్ర ప్రణాళికతో అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని చెప్పారు.

ఈ ప్రాంత రైతులను అభినందిస్తున్నానని, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల కోసం భూములుత్యాగం చేసిన రైతులను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని స్పష్టం చేశారు.  వారిని గౌరవించాల్సిన బాధ్యత  ఉందని, ఆందోళనలు చేపడుతున్న రైతులతో చర్చించాలని మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి సూచించారు.  

పెట్టుబడులకు, ఉపాధి అవకాశాలకు కీలక మైలురాయి..

మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, సీఎం రేవంత్‌రెడ్డి దూరదృష్టి నాయకత్వంలో తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్‌కు భూమిపూజ తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణకు, పెట్టుబడుల ఆకర్షణకు, ఉపాధి అవకాశాల కల్పనకు మైలురాయిగా నిలుస్తుందన్నారు.  కృత్రి మ మేధస్సు విస్తరణతో పెరుగుతున్న డేటా ప్రాసెసింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణను  అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్ జాజు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు కిరణ్మయి, చంద్రారెడ్డి, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధులు విక్రమ్, అనురాగ్,  అధికారులు, ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు.