calender_icon.png 17 December, 2025 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. భారీగా లొంగుబాటు

16-12-2025 10:35:10 PM

ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా(Bijapur District)లో మంగళవారం 34 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు పేర్కొన్నారు. వీరిలో 26 మందిపై మొత్తం రూ. 84 లక్షల రివార్డు ఉంది. ఏడుగురు మహిళలతో సహా ఈ నక్సలైట్లు సీనియర్ పోలీసు, సీఆర్‌పీఎఫ్ అధికారుల ముందు లొంగిపోయారని బీజాపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జితేంద్ర యాదవ్ తెలిపారు. ఈ మావోయిస్టులు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ(డీకేఎస్‌జెడ్సీ), తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు విభాగంలో చురుకుగా ఉన్నారని ఆయన వెల్లడించారు. లొంగిపోయిన వారిలో పాండ్రు పునెమ్ (45), రుక్ని హేమ్లా (25), దేవ ఉయికా (22), రామ్‌లాల్ పోయం (27), మోటు పునెమ్ (21) వంటి కీలక నాయకులు ఉన్నారని, వీరిలో ప్రతి ఒక్కరిపై రూ. 8 లక్షల రివార్డు ఉందని ఆయన తెలిపారు. 

పునరావాస విధానం కింద, లొంగిపోయిన వారికి తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ. 50,000తో పాటు, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అందించే నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారురాష్ట్ర ప్రభుత్వ పునరావాస విధానం మావోయిస్టులను హింసను విడిచిపెట్టేలా ఆకర్షిస్తోందని.. లొంగిపోయిన వారి కుటుంబాలు కూడా వారు సాధారణ జీవితం గడిపి సమాజంలో కలిసిపోవాలని కోరుకుంటున్నాయని జితేంద్ర యాదవ్ అన్నారు. ప్రభుత్వ లొంగుబాటు, పునరావాస విధానంతో ప్రేరణ పొంది, గత రెండేళ్లలో దంతెవాడ జిల్లాలో 824 మంది మావోయిస్టులు హింసను విడిచిపెట్టి సామాజిక ప్రధాన స్రవంతిలో చేరారని.. గత రెండేళ్లలో ఛత్తీస్‌గఢ్‌లో అగ్ర నాయకులతో సహా 2,200 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారని పోలీసులు తెలిపారు. కాగా, 2026 మార్చి నాటికి దేశం నుండి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.