3 August, 2026 | 11:39 AM

భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత

03-08-2026 11:05 AM

ఈ ఏడాది కుంభ వర్షాలు.. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి

ఆర్నెళ్లలో విగ్రహ ప్రతిష్ఠ జరగకుంటే.. వాడవాడలా ప్రాణనష్టమే

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు(Secunderabad Ujjaini Mahankali Bonalu) ఘనంగా జరిగాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కన్నులపండువగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి భవిష్యవాణి(Mathangi Swarnalatha Bhavishyavani ) జరిగింది. పచ్చికుండపై నిల్చొని మాతంగి స్వర్ణలత రంగం భవిష్యవాణి వినిపించారు. తాను సంతోషంగా రాలేదని, క్రోధంతో వచ్చానని భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత చెప్పారు. ప్రజల్లో అహంకారం ఎక్కువవుతోంది, తగ్గించుకుంటే మంచిదన్నారు. తన విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని చేయలేదని భవిష్యవాణిలో తెలిపారు.

మీ ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పాలన్న మాతంగి స్వర్ణలత ఈ ఏడాది నన్ను బాధపెడుతున్నారు, కంటతడి పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. మీరు నా మాటలు ఏమైనా ఆచరిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఈ ఏడాది కుంభ వర్షాలు ఉన్నాయని, కుంభవర్షంలో ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని భవిష్యవాణిలో స్వర్ణలత హెచ్చరించారు. ఈ ఏడాది ప్రాణనష్టం, అగ్నిప్రమాదాలు సంభవిస్తాయని తెలిపారు. వావివరుసలు లేకుండా ఘోరాలు చేస్తున్నారు, వాళ్లలను నేను వదిలిపెట్టనని మాతంగి స్వర్ణలత వార్నింగ్ ఇచ్చారు. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తే.. కోరికలు నెరవేరుస్తానని చెప్పారు. ఆర్నెళ్లలో విగ్రహ ప్రతిష్ఠ జరగకుంటే వాడ వాడలా ప్రాణనష్టమే అన్నారు.