2 May, 2026 | 12:10 AM

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే

01-05-2026 10:46 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్ 11వ డివిజన్ ఇందిరా నగర్ కాలనీ లో చౌరస్తాలో సిపిఐ పార్టీ మేడిపల్లి మండల కార్యదర్శి రచ్చ కిషన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరానగర్ కాలనీ చౌరస్తాలో సిపిఐ పార్టీ, ఏఐటీయూసీ జండాలను సీనియర్ నాయకులు విబి బాల రాజు,దండ రమేష్ లు జండా ఎగురవేశారు. అనంతరం రచ్చ కిషన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది  శ్రామికులు అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని అంటే మేడేని ఘనంగా జరుపుకుంటారు.

ఈ మేడే 1886వ సంవత్సరం అమెరికాలోని చికాగో నగరంలో లక్షలాది కార్మికులు రోజుకు 16 నుండి 18 గంటలు పని చేయవలసిన దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సమయంలో రోజుకు 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు మన కోసం" అనే నినాదంతో కార్మికులు మే 1న సమ్మె బాట పట్టారు. వేల మంది కార్మికులు చికాగో వీధుల్లో శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. మే 4వ తేదీన హే మార్కెట్ స్క్వేర్‌లో జరిగిన సభలో పోలీసులు లాఠీలు ఝళిపించారు. అనామక వ్యక్తి  బాంబు నిసరడంతో పోలీసులు కాల్పులు జరిపారు.

అనేక మంది కార్మికులు అమరులయ్యారు. మిగతా నాయకులకు ఉరిశిక్ష విధించారు. అయితే వారి బలిదానం వ్యర్థం కాలేదు.1889లో పారిస్‌లో జరిగిన రెండవ అంతర్జాతీయ కార్మిక సమావేశం మే 1వ తేదీని అధికారికంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించింది. నేడు 80కి పైగా దేశాలు ఈ రోజును జాతీయ సెలవు దినంగా పాటిస్తున్నాయి. భారతదేశంలో తొలిసారి మే డే 1923లో చెన్నైలో జరుపుకున్నారు. కార్మిక నాయకుడు సింగారవేలర్ నేతృత్వంలో నిర్వహించిన ఆ కార్యక్రమంలో మొదటిసారి ఎర్రజెండా రెపరెపలాడింది. అప్పటి నుండి ఈ దేశంలో కార్మికుల ఉద్యమం బలపడుతూ వచ్చింది అన్నారు.