ముఖ్యమంత్రి పర్యటనలో లోటుపాట్లకు తావివ్వొద్దు
అధికారులు అప్రమత్తంగా బాధ్యతలు నిర్వర్తించాలి
జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటిడిఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పోతో కలిసి ఈ నెల 16న ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్ల పురోగతిపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది డ్యూటీ పాసులు, గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. మేడారం వనదేవతల ప్రాంగణం, పరిసర ప్రాంతాలు, నూతన కలెక్టరేట్, పైలాన్, గట్టమ్మ ఆలయ ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మేడారంలో వనదేవతల దర్శనం, తులాబారం, పింఛన్ల పంపిణీ కార్యక్రమాలతో పాటు నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం, సభా ప్రాంగణంలో చేపట్టాల్సిన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని తెలిపారు.
ప్రతి అధికారికి అప్పగించిన బాధ్యతపై పూర్తి అవగాహన ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా సమన్వయంతో, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, ఆర్డీవో కృష్ణవేణి, డీఆర్వో రవికుమార్, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.






