13 April, 2026 | 2:00 AM

బతికేద్దామా 110 ఏళ్లు!

19-12-2024 12:00 AM

ఉరుకుల పరుగుల జీవితం, అస్తవ్యస్త అలవాట్లు కారణంగా మనిషి జీవన కాలం క్రమక్రమంగా పడిపోతోంది. ఫలితంగా వందేళ్లు హాయిగా బతకాల్సిన మనిషి 60, 70 ఏళ్లకే కనుమూస్తున్నాడు. మనదేశంలో వందేళ్లు బతికినవాళ్లను చూస్తే అదేదో గిన్నిస్ బుక్ రికార్డ్‌గా భావిస్తాం. కానీ కొన్ని దేశాల్లో వందేళ్లు కాదు.. 110 దాకా బతికేస్తున్నారు. వందేళ్లకుపైగా జీవించడం సాధ్యమే నా అంటే ఎస్ అనే సమాధానమిస్తున్నారు సైంటిస్టులు. ఇంతకీ ఆ ఆరోగ్య రహస్యమెంటో తెలుసుకుందామా..

ఒకప్పుడు మన పూర్వీకులు వందేళ్లు బతికేవారు. మన పెద్దలు కూడా సెంచరీ కొట్టిన వారున్నారు. అయితే ఇప్పు డు అలాంటి ఆలోచన చేయడమే అసాధ్యం గా అనిపిస్తోంది. ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వం దేళ్లు బతకడం అంటే కష్టమనే అనిపిస్తుంటుంది. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడిప్పు డే మార్పులొస్తున్నాయి. ప్రపంచమంతా నూరేళ్లు బతకాలంటే ఏమి చేయాలి? అనే విషయంపై కొన్ని అధ్యయనాలు జరుగుతున్నాయి.

ఇటలీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జపాన్ లాంటి దేశాల్లో 100 నుంచి -110 వరకు జీవిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. యూనివర్సిటీ కాలేజ్ లండన్ సెంటర్ ఫర్ లాంగిట్యూడినల్ స్టడీస్ అధ్యయనంలో కూడా ఈ విషయం స్పష్టమైంది. అలాగే జపాన్‌లో మహిళల సగటు వయసు 88 ఏళ్ళు కాగా, పురుషుల సగటు వయసు 82 ఏళ్లు.

ఆ దేశ జనాభాలో 29శాతం మంది 60 ఏళ్లు దాటినవారు ఉన్నారు. సింగపూర్, స్విట్జర్లాండ్, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో ఇలాంటే పరిస్థితి ఉంది. ప్రజల ఆయుర్దాయం ఎక్కువగా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. జనాలు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకోవడం, తమ జీవనశైలి కూడా ఆరోగ్యకరంగా ఉండటమే ఇందుకు కారణం.

జపాన్, ఇటలీ, ఇంగ్లాండ్ లాంటి దేశస్తులు కష్టపడే తత్త్వం ఉన్నారు. క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. తినే తిండిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. కొవ్వు పదార్థాలు తక్కువగా తింటారు. చేపలు, కూరగాయలు ఎక్కువగా తింటారు. గ్రీన్ టీ తాగుతారు. ఇక్కడ జననాల రేటు తగ్గుతోంది.

ఉద్యోగం చేసే వయసులో ఉండే జనాభా సంఖ్య క్రమంగా తగ్గుతోంది. జపాన్‌లో పదవీ విరమణ చేసిన తర్వాత కూడా అక్కడి జనాలు కొత్త ఉద్యోగాలు చేస్తారు. వారు పదవీ విరమణ తర్వాత సెకండ్ లైఫ్‌తోపాటు సెకండ్ కెరీర్ స్టార్ట్ చేస్తారు. దీంతో వారి లైఫ్ పక్కా ప్రణాళిక ప్రకారం సాగుతుంది. ఇది వారిని ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది.

విదేశాల్లో వందేళ్లు దాటుతున్న వారి సం ఖ్య.. ఏటా పెరుగుతోంది. దీనిపై పరిశోధన లు జరుగుతున్నాయి. నిజానికి వయసు పెరి గే కొద్దీ.. మెదడు పరిమాణం తగ్గుతుంది. దీంతో, జ్ఞాపక శక్తి తగ్గుతుంది. పనులు చేసే సామర్ధ్యం తగ్గుతుంది. ప్రవర్తనలో మార్పు లు వస్తాయి. వాళ్లు ఒత్తిడికి, ఆందోళనకు గురవుతారు. అయితే అందరిలోనూ ఈ లక్షణాలు ఒకేలా ఉండే అవకాశం లేదు. ఇక ఇతరులతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ.. ప్రేమానుబంధాలతో ఉండేవారికి ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందని సైంటిస్టులు చెప్తున్నారు.

ఒత్తిడి, ఆందోళన లేకపోతే.. జీవితకాలం మరింత పెరుగుతుందని ఆ అధ్యయనంలో తేలింది. చాలాకాలం బతికి ఉండాలంటే.. ఆరోగ్యకరమైన సంబంధాలు అవసరం. అది శాస్త్రీ యంగా నిజమైంది కూడా. అయితే మనసు కు నచ్చిన పనులు చేయడం ద్వారా ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంది. 

పెరుగుతున్న ఆయుర్దాయం 

110 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు దాటి జీవించేవారి సంఖ్య ఈ శతాబ్దంలో పెరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. యూఎస్‌లో 85-ప్లస్ జనాభా 2040 నాటికి 14.6 మిలియన్లకు మూడు రెట్లు పెరుగుతుందని అంచనా వేయబడింది. 90 ఏళ్ల తర్వాత జీవించేవారి సంఖ్య భారీగా ఉండబోతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఇందుకు కొందరిని ఉదాహరణగా ప్రస్తావించింది. ఫ్రాన్స్‌కు చెందిన జీన్ కాల్మెంట్ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు. ఆమె 1997లో మరణించినప్పుడు ఆమె వయస్సు 122. అలాగే జపాన్‌కు చెందిన 118 ఏళ్ల కేన్ ఎక్కువ కాలం బతికిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. సోగెన్ కాటో సీనియర్ సిటిజన్ కూడా 111 ఏళ్లు బతికాడు. 

ఎక్కువ కాలం జీవించాలంటే

* కేలరీల తీసుకోవడం పరిమితం చేయండి.

* అన్ని రకాల ఆహార పదార్థాలు తినాలి. 

* శారీరకంగా చురుకుగా ఉండాలి.

* రోజుకు కనీసం 15 నిమిషాల వ్యాయామం చేయండి.

* ఆల్కహాల్ అలవాటు ఉంటే మితంగా తీసుకోవాలి. 

* ఒత్తిడికి గురికాకండి.  

* ధూమపానం చేయొద్దు

* జీవితంపై సానుకూల దృక్పథం కలిగి ఉండటం.