తెలంగాణలో మరో సమ్మెకు సైరన్
అర్ధరాత్రి నుంచే ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్‌ల బంద్!
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు నిరవధిక బంద్‌కు సిద్ధమయ్యారు. డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభం కానుందని డ్రైవర్ సంఘాల నేతలు ప్రకటించారు. డ్రైవర్లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు ప్రతి ఏడాది రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు. ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని, ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని డ్రైవర్ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
మరోవైపు ఆర్టీసీ ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెట్టే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డ్రైవర్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విధానం అమల్లోకి వస్తే ఇప్పటికే ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్న డ్రైవర్ల ఉపాధిపై ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 18 సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బంద్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని నేతలు తెలిపారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని, లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.






