calender_icon.png 21 February, 2026 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్ని ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు..

21-02-2026 05:01:12 PM

మైత్రివనంలో డాక్టర్ కోట నీలిమ అవగాహన సమావేశం

సనత్‌నగర్,(విజయక్రాంతి): వేసవి ఎండలు పెరిగాయని ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువని, వాటి నివారణకు అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. తాజాగా అమీర్ పేట్ మైత్రివనంలోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆమె స్థానిక కోచింగ్ సెంటర్ యజమానులు, హోటల్ నిర్వాహకులు, అద్దెదారులు, హైడ్రా, ఫైర్, సేఫ్టీ అధికారులు, వివిధ అసోసియేషన్ల నేతలతో అవగాహన సమావేశం నిర్వహించారు.

అగ్ని ప్రమాదం జరిగిన తీరు, అధికారుల చర్యలను వారికి వివరించారు.ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ.. నిబంధనలు పాటించకుండా, నివారణ చర్యలపై దృష్టి పెట్టకపోవడంతో అగ్నిప్రమాద ఘటనలు పెరుగుతున్నారు. విద్యుత్ సరఫరాలో లోపాలను గుర్తించకపోవడం, ఫైర్ ఆడిట్ నిర్వహించకపోవడంతోపాటు మానవ తప్పిదాలు ఇందుకు కారణమవుతున్నారు. ఎత్తయిన భవన నిర్మాణాలకు స్థానిక అగ్నిమాపకశాఖ అధికారి నుంచి అనుమతి తప్పనిసరి తీసుకోవాలన్నారు. హైడ్రెంట్లు, ఫైర్ ఎగ్జిట్లు, స్ప్రింక్లర్లు, పంప్ రూమ్ వంటివి భారీ భవన సముదాయాల్లో ఏర్పాటు చేయాలన్నారు.

ప్రతి అంతస్తులో ప్రవేశ, నిర్గమన మార్గాలు, భద్రతపై సైనేజ్ బోర్డులు ప్రదర్శించాలన్నారు. స్మోక్ అలారం ఏర్పాటు చేయడంతో పాటు ఏటా భద్రతా తనిఖీలు అవసరమని పేర్కొన్నారు. ప్రతి అంతస్తులో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉండాలని.. మూడు నెలలకోసారి ఫైర్ డ్రిల్స్ నిర్వహించాలని అధికారులను కోరారు. అగ్నిప్రమాదాలు జరిగితే కంగారుపడకుండా ఫైర్ అలారం మోగించి అప్రమత్తం చేయాలన్నారు. లిఫ్ట్ కు బదులు మెట్ల మార్గాన్ని వినియోగించాలని... మంటలు ఎక్కువగా ఉన్న సమయంలో నడవకుండా ముఖానికి గుడ్డ కప్పుకొని పాకుతూ అక్కడి నుంచి బయటికి రావాలన్నారు.

మంటల్లో చిక్కుకుంటే బిగ్గరగా అరుస్తూ, చేతి రుమాలును కిటికీ లేదా బాల్కనీ నుంచి ఊపుతూ బయట ఉన్నవాళ్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. విద్యుత్ మరమ్మతులు క్వాలిఫైడ్ ఎలక్ట్రిషియన్ తో మాత్రమే చేయించాలని.. అతుకులు కలిగిన తీగలు, లూజ్ వైరింగ్ ప్రమాదకరమని పేర్కొన్నారు. విద్యుత్ ద్వారా నడిచే రిఫ్రిజిరేటర్లు, ఓవెన్ ను గాలి, వెలుతురు బాగా వచ్చే చోట ఉంచాలని.. అధిక ఓల్టేజీ ఉన్న ఉపకరణాలకు ఎర్తింగ్ ఉన్న పిన్ సాకెట్లను వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో GHMC డిప్యూటీ కమిషనర్ సుజాత, SR నగర్ SHO శ్రీనివాస్ రెడ్డి, హైడ్రా అధికారి మోహన్ రావు, ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ మహేష్, బిల్డింగ్ మేనేజ్ మెంట్, వివిధ అసోసియేషన్ల నేతలు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.