ఒడిశాలో మెడికల్ ప్రశ్నాపత్రం లీక్
పరీక్ష మొదలైన కొద్ది నిమిషాల్లోనే వాట్సాప్‌లో ప్రత్యక్షం
భువనేశ్వర్, జూలై ౩౦: ఒడిశాలో మరో పరీక్ష పత్రం లీకేజీ కలకలం రేపింది. ఒకవైపు నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశం దేశవ్యాప్తంగా ఆందోళనలు రేపడం, లీకేజీ కట్టడికి కేంద్ర ప్రభుత్వం పరీక్షల సవరణ బిల్లు తీసుకువచ్చిన వేళ.. ఈ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా చర్చనీయాశమైంది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం మెడికల్ పీజీ పరీక్షలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఈ నెల ౨౭న ఎంఎస్/ఎండీ విద్యార్థులకు జనరల్ సర్జరీ థియరీ పరీక్ష జరిగింది.
పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో చక్కర్లు కొట్టింది. పరీక్ష జరుగుతున్న సమయంలోనే కొన్ని ఫోన్ నంబర్ల నుంచి సమాధానాలు కూడా పంపారనే ఆరోపణలు ఉన్నాయి. భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థి ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చాడు. బరంపురానికి చెందిన ఓ విద్యార్థి అడ్మిన్‌గా ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో మొదట ప్రశ్నాపత్రం ప్రత్యక్షమైందని అక్కడి యంత్రాంగం ప్రాథమికంగా గుర్తించింది. మరోవైపు, పేపర్ లీకేజీ అంశంపై ఒడిశా నివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఓహెచ్‌ఎస్) అంతర్గత విచారణకు ఆదేశించింది.






