దళితబంధు అక్రమార్కులపై ఉచ్చు
- నకిలీ బిల్లులు, తప్పుడు పత్రాలతో రూ.156 కోట్లకుపైగా లూటీ
- హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన జిల్లా వాసులు
- కలెక్టర్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలకు హెచ్‌ఆర్సీ ఆదేశం
నాగర్‌కర్నూల్, జూలై 30 (విజయక్రాం తి):సమాజంలో తీవ్రమైన అణిచివేతలు, అవమానాలు ఎదుర్కొంటూ ఆర్థికంగా వెనకబడిన వారిని ఆదుకోవాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం దళితులకు ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున అందించేందుకు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు కింద నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం ఎంపిక చేసి ఆ గ్రామంలోని దళితులందరికీ దళిత బంధు పథకం వర్తింపజేసింది. కాగా పథకాన్ని అమలు చేసే ప్రక్రియలో అధికారులు నకిలీ బిల్లులు, తప్పుడు పత్రాల ద్వారా రూ.156 కోట్లకుపైగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైనట్లు జిల్లా వాసులు పలుదాఫాలుగా ఫిర్యాదులు చేస్తూ వచ్చారు.
అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తెలంగాణ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ ఆశ్రయించారు. ప్రస్తుతం విచారణ అనంతరం హెచ్‌ఆర్సీ తీసుకున్న నిర్ణయంతో రిటైర్మెంట్ పొందిన అధికారులకు సైతం ఉచ్చు బిగిస్తోంది. ఈ వ్యవహారంపై జిల్లా వాసులు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్సీ)ని ఆశ్రయించగా, జిల్లా కలెక్టర్ సమర్పించిన నివేదికను పరిశీలించిన కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.అప్పటి ఎస్సీ కార్పొరేషన్ ఇన్చార్జి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యు.
రామ్లాల్తో పాటు పలువురు అధికారులపై నకిలీ సంస్థలు, నకిలీ బిల్లులు, అక్రమ చెల్లింపులు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు పెన్షన్, గ్రాట్యుటీ నిలిపివేసి దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని ఫిర్యాదు దారులు కోరారు.
ఈ అంశాన్ని ఇప్పటికే షెడ్యూల్ కాస్ట్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ (ఎస్సీడీడీ) ప్రధాన కార్యదర్శికి తదుపరి చర్యల కోసం పంపినట్లు హెచ్‌ఆర్సీ వెల్లడించింది. బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని రికవరీ చేయాలని సూచించింది. ఈ వ్యవహారంలో అప్పటి ఉన్నతాధికారి పక్కనే ఉన్న అధికారికి కీలకపాత్ర పోషించినట్లు ఫిర్యాదుదారులు ఆరోపించారు. ప్రసాద్ ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.






