31 July, 2026 | 2:01 AM

వైద్యశాఖలో ఈగోల పోరు!

31-07-2026 01:15 AM
  1. రోగుల ప్రాణాలతో చెలగాటం
  2. విజృంభిస్తున్న విషజ్వరాలు.. పక్కనపడ్డ ప్రజాసేవ
  3. డీఎంహెచ్‌ఓ వర్సెస్ ఉద్యోగులు
  4. పీక్స్‌కి చేరిన వివాదం
  5. బాధ్యులపై కఠిన చర్యలకు ప్రజల డిమాండ్

రంగారెడ్డి,జూలై 30 (విజయక్రాంతి): ఒకవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షా లు.. మరోవైపు గ్రామీణ ప్రాంతాలను వణికిస్తున్న డెంగ్యూ, మలేరియా, తీవ్ర విషజ్వరా లు. రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటే, వారికి వైద్యం అందించాల్సిన అధికారులూ, సిబ్బంది మాత్రం ఆధిపత్య పోరులో మునిగిపోయారు. రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శా ఖ కార్యాలయం ప్రస్తుతం ప్రజాసేవను పక్కనపెట్టి, తీవ్ర ఇగోల పోరాటానికి, రాజకీయ చదరంగానికి అడ్డాగా మారింది.

వైద్యారోగ్య శాఖ మంత్రికి వరుస ఫిర్యాదులు..

వారం తిరక్కుండానే రెండోసారి టీఎన్జీఓ నేతలతో కలిసి జిల్లా వైద్యశాఖ సిబ్బంది సెక్రటేరియట్ మెట్లెక్కారు. జిల్లా వైద్యాధికారిణి  వైఖరిపై సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు మళ్లీ ఫి ర్యాదు చేశారు. దీంతో ఈ వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే, ఈ ఆగ్రహం వె నుక అసలు కథేంటి? ఇది అధికారిణి నిరంకుశత్వమా? ఉద్యోగుల నిర్లక్ష్యమా? లేక అధి కారం కోసం ‘కుర్చీ లాటరీ’ ఆటేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అధికారుల ఆగ్రహం: ‘వేధింపులు తాళలేకపోతున్నాం’

మూడు నెలల క్రితం వికారాబాద్ నుంచి బ దిలీపై వచ్చిన డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి వైఖరిపై కిందిస్థాయి నుంచి సీనియర్ డాక్టర్ల వరకు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

చులకన భావం: 

సీనియర్ అధికారులను, పిహెచ్సి  డాక్టర్లను గంటల తరబడి ఛాంబర్ బయట నిలబెట్టడం, బహిరంగంగా చులకనగా మాట్లాడటం పరిపాటిగా మారిందని ఆరోపిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సలహాలను పక్కనపెట్టి ఏకపక్షంగా బదిలీలు చేయడం, విధుల్లో ఉన్నవారిపై కక్షసాధింపుగా మెమోలు జారీ చేయడం వివాదానికి ఆజ్యం పోసింది.

సెలవుల్లో డాక్టర్లు

 మేడమ్ వేధింపులు తట్టుకోలేక పలువురు డాక్టర్లు సుదీర్ఘ సెలవుల్లోకి వెళ్లడంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు పూర్తిగా పడకేసాయి. ఆకస్మిక తనిఖీల భయమే కారణమా?అయితే నాణేనికి మరోవైపు చూస్తే, ఏళ్ల తరబడి సాగుతున్న అలసత్వానికి చెక్ పెట్టడమే ఈ వివాదానికి అసలు కారణమనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. కొత్త డీఎంహెచ్‌ఓ వచ్చాక విధులకు సమయపాలన, బయోమెట్రిక్ హాజరును కఠినతరం చేశారు. ఆకస్మిక తనిఖీలు చేపట్టి, బాధ్యతారాహిత్యంగా ఉన్నవారికి మెమోలు ఇవ్వడంతో ఇన్నాళ్లూ అనుభవించిన ‘సౌకర్యవంతమైన నిర్లక్ష్యానికి‘ గండి పడింది. నిబంధనలు పాటించమని గట్టిగా అడిగినందుకే అధికారిణిపై ’నియంత’ అనే ముద్ర వేసి సాగనంపే వ్యూహం పన్నుతున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయి.

తెరవెనుక ’కుర్చీ లాటరీ’ రాజకీయం..

హైదరాబాద్కు సమీపంలో ఉండే రంగారెడ్డి డీఎంహెచ్‌ఓ పోస్టింగ్ అనేది కేవలం ఒక పరిపాలనా పదవి మాత్రమే కాదు; అదొక అపారమైన అధికారాల నిలయం.జిల్లాలోని వందలాది ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్లు, క్లినిక్ల అనుమతులు, కోట్లాది రూపాయల బడ్జెట్ కేటాయింపులు, అంతర్గత బదిలీల నెట్వర్క్ అంతా ఈ ఒక్క సీటు నుంచే నడుస్తుంది. పరిపాలనా పరంగా ఇది ఒక ’బంగారు బాతు’ లాంటి పోస్టింగ్. అందుకే కొత్త అధికారిణిని వివాదాల్లోకి నెట్టి సాగనంపితే, ఆ సీటును తమ వారికి దక్కించుకోవచ్చని కొందరు సీనియర్ వైద్యాధికారులు తెరవెనుక చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

తక్షణ పరిష్కారం తథ్యం..

ఈ ఆధిపత్య పోరులో అసలు నష్టపోతోంది మాత్రం సామాన్య ప్రజలు...ఉచిత వైద్యం కోసం వచ్చే పేద రోగులే. వర్షాలు, విషజ్వరాల వేళ ఆసుపత్రుల్లో ఉండాల్సిన సిబ్బంది ధర్నాలు, వినతిపత్రాలకే పరిమితమవ్వడం అక్షరాలా బాధ్యతారాహిత్యమే.

మంత్రి, కలెక్టర్ల జోక్యం అవసరం:

వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తక్షణమే స్పందించి పూర్తిస్థాయి విచారణ జరిపించాలి. అధికారిణి నోటిదురుసు, నిరంకుశత్వం నిజమని తేలితే ఆమెపై చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో, విధుల్లో అలసత్వం వహిస్తూ, ‘కుర్చీ లాటరీ’ కుట్రలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిబ్బంది లేదా ఉద్యోగ సంఘాల నేతలపై కూడా అంతే కఠినంగా వ్యవహరించాలి.తక్షణమే ఈ రచ్చకు ముగింపు పలికి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.