కోదాడలో 19న మెగా జాబ్ మేళా

14-09-2026 | 05:15am
  1. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి
  2. 250 నుంచి 300 పైచిలుకు కంపెనీల్లో ఉద్యోగాలు
  3. 4వేల మందికి ఉద్యోగ అవకాశాలు 
  4. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సూర్యాపేట, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 19న కోదాడ పట్టణంలోని సీసీరెడ్డి కాన్వెంట్‌లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Minister Uttam Kumar Reddy)వెల్లడించారు. ఆదివారం ఆయన కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎమ్మెల్యే ఉత్తమ్‌పద్మావతిరెడ్డితో కలిసి కోదాడ సీసీ కాన్వెంట్‌లో మెగా జాబ్ మేళా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి కంపెనీ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ సంయుక్తంగా  నిర్వహిస్తు న్న ఈ జాబ్ మేళాలో ఐటీ, సేవా, నిర్మాణ, వాణిజ్య, ఫార్మారంగలకు చెందిన 300 పైచిలుకు  కంపెనీలు హాజరుకానుండగా, సుమారు 4000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు వెల్లడించారు. పది, ఇంట ర్, డిగ్రీ, ఇంజినీరింగ్,  ఫార్మసీ, ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించిన వారు, 2026 లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు అర్హత ఉంటుందని తెలిపారు.

ఉమ్మడి నల్లగొండతోపాటు ఖమ్మం జిల్లా యువత ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల నిరుద్యోగులు అత్యధికంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా రు. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ఇంటర్వ్యూలు ఉంటాయని, ఉద్యోగం సంపాదించిన వారికి వెంటనే ఆర్డర్స్ ఇస్తారని చెప్పారు. గతేడాది అక్టోబర్‌లో హుజుర్‌నగర్‌లో నిర్వహించిన ఉద్యోగ మేళాకు అనూహ్యంగా 45 వేల మందికిపైగా నిరుద్యోగులు తరలిరావ డంతో తీవ్ర రద్దీ నెలకొందని,

ఆ అనుభవాలను దృష్టి లో ఉంచుకుని ఈసారి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వాహకులు పక్కా ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. అభ్యర్థుల తాకిడిని క్రమబద్ధీకరించేందుకు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు మూడు వేర్వేరు సమయ స్లాట్లుగా విభజించాలన్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకుని తమకు కేటాయించిన సమయానికే రావాల్సి ఉంటుందన్నారు.

సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల నుంచి వచ్చేవారికి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. జాబ్ మేళా ప్రాంగణం వద్ద 5 వేల నుంచి 10 వేల వరకు వాహనాలు నిలిపేందుకు వీలుగా భారీ పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అభ్యర్థులతో పాటు వారి వెంట వచ్చే తల్లిదండ్రుల కోసం ఉచిత భోజన వసతి కల్పించాలని ఆదేశించారు. 

అభ్యర్థుల ప్రతిభను బట్టి ఎంపికలు 

జాబ్ మేళాలో 27 వేల ఉద్యోగాలు ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న ప్పటికీ, ఆ అంకెలను చూసి అభ్యర్థులు భ్రమపడొద్దని స్పష్టం చేశారు. కేవలం ప్రకటనల ఆధారంగా కాకుండా, అభ్యర్థుల ప్రతిభ, సాంకేతిక నైపుణ్యాల  ఆధారంగానే పారదర్శకంగా ఎంపికలు జరుగుతాయని తెలిపారు. అన్ని అర్హతలు కలిగిన దాదాపు 3,000 నుంచి 4,000 మంది నిరుద్యోగులకు పక్కాగా ఉద్యోగ నియామక పత్రాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు.

ఈ ఎంపిక ప్రక్రియలో ఎలాంటి పైరవీలకు, సిఫార్సులకు తావులేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అధ్యక్షతన ప్రత్యేక నిర్వహణ కమిటీని నియమించినట్లు వివరించారు. జిల్లా అధికార యంత్రాంగం నిరంతరం సమన్వయం చేసుకుంటూ మేళా సాఫీగా సాగేలా చూడాలని మంత్రి ఆదేశించారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ..

క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఒక అభ్యర్థి అయిదు కంపెనీల ఇంటర్వ్యూకు హాజరు కావచ్చన్నారు. అంతకుముందు మంత్రి సీసీ రెడ్డి కాన్వెం ట్ గ్రౌండ్‌ను పరిశీలించి స్టాల్స్, భోజన వసతి తదితర  ఏర్పాట్ల గురించి మంత్రి పరిశీలించారు. ఈ సమీక్షలో ఎస్పీ నరసింహ, ఆర్డీవో సూర్యనారాయణ, శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు