ప్రజారోగ్యంతో చెలగాటం
వంటగదిలో నిత్యం వినియోగించే పదార్థాలు, మసాలాలన్నీ ఇప్పుడు కల్తీ కాటుకు గురవుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు ప్రధాన పట్టణాల్లో తరచూ ‘కల్తీ’కారుల అక్రమాలు వెలు గు చూడటం ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల మైలార్‌దేవ్‌పల్లి, లాలాగూడల్లో అపరిశుభ్ర వాతావరణంలో తయారవుతున్న కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కేంద్రాలపై పోలీసులు జరిపిన దాడులు ఒక ఎత్తయితే, బంజారాహిల్స్ వంటి సంపన్నుల నివాస ప్రాంతంలో ‘ప్రైడ్ డెయిరీ’ పేరిట సాగుతున్న కల్తీ నెయ్యి దందా మరో ఎత్తు.
కేవలం అల్లం వెల్లుల్లి, నెయ్యి మాత్రమే కాదు.. మనం నిత్య ఇంట్లో వినియోగించే పాలు, కారం, నూనె నుంచి టీ పొడి చివరకు.. ప్రతీది నకిలీమయం అవుతుండటం ఆందోళనకరం. శంషాబాద్ జోన్ పరిధిలోని జల్‌పల్లి, పహాడీషరీఫ్ ప్రాంతాల్లో పట్టుబడి న కల్తీ పదార్థాల తయారీ కేంద్రాలను పరిశీలిస్తే, ఆహార భద్రత ప్రమాణాలను గాలికొదిలేసి, లాభార్జనే ధ్యేయంగా దందా సాగినట్లు స్పష్టమ వుతున్నది. కల్తీల వెనుక వాస్తవాలు అత్యంత దారుణంగా ఉన్నాయి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీలో అక్రమార్కులు కుళ్లిన అల్లం, తక్కువ నాణ్యత గల వెల్లుల్లికి తోడు.. జిగురు కోసం ప్రమాదకరమైన ‘ఎక్స్‌జన్ గమ్ పౌడర్’, రంగు కోసం సింథటిక్ రసాయనాలు, నిల్వ ఉండటానికి అధిక మోతాదులో సిట్రిక్ యాసిడ్ వాడినట్లు అధికారులు గుర్తించారు. ఈ పదార్థాలు మనిషి శరీరంలోకి వెళితే జీర్ణకోశ వ్యాధుల నుంచి మొదలుకొని దీర్ఘకాలంలో క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది.
కల్తీ నెయ్యి విషయానికొస్తే, అక్రమార్కులు తక్కువ ధరకు లభించే పామాయిల్, డాల్డా, హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఫ్యాట్స్‌ను ఆవు, గేదె పాల మీగడలో కలిపి తమదే స్వచ్ఛమైన నెయ్యి అని మార్కెట్లోకి వదులుతున్నారు. పాల ను చిక్కగా మార్చేందుకు వీరు యూరియా, డిటర్జెంట్ పొడి, గ్లూకోజ్, స్టార్చ్ పౌడర్లు వాడుతున్నట్లు తేలింది. ఈ నెయ్యిని వినియోగిస్తే కాలేయం దెబ్బతినడం, మూత్రపిండాల వైఫల్యం, గుండె సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అసలు ఈ కల్తీ మహమ్మారి ఇంతలా వేళ్లూనుకోవడానికి మారుతున్న జీవనశైలే ప్రధాన కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. ఆధునిక కాలంలో ‘ఇన్‌స్టంట్ ఫుడ్’పై మోజు, ఏ వంట అయి నా త్వరగా సిద్ధమైపోవాలనే ఆతృత.. కల్తీ కేటుగాళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకునే ఓపిక లేకపోవడం, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా వచ్చే ఆకర్షణీయమైన ఆఫర్ల వెంట పడటం వల్ల మనం తెలియకుండానే విషాన్ని కొని తెచ్చుకుంటున్నాం.
తక్కువ ధరకే దొరుకుతున్నాయని నాణ్యతను పట్టించుకోకుండా రోడ్డు పక్కన విక్రయించే విడి అల్లం పేస్ట్‌లు, లోకల్ బ్రాండ్ నెయ్యి ప్యాకెట్లను ఆశ్రయించడం ప్రాణాంతకం. హోటళ్లు, ఫంక్షన్ హాళ్లలో లాభాల కోసం ఇలాంటి కల్తీ ఉత్పత్తులనే వాడుతున్నట్లు యంత్రాంగం విచారణలో తేల డం గమనార్హం. కేవలం పోలీసుల దాడులు, అరెస్టులతోనే ఈ వ్యవస్థ ప్రక్షాళన కాదు. వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలి.
సాధ్యమైనంత వరకూ ఇంట్లో తయారు చేసుకునే పదార్థాలనే, వినియోగించు కోవడం ఉత్తమం. అధిక లాభాల కోసం సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ ముఠాలపై ప్రభుత్వాలు కఠిన చట్టాలను ప్రయోగించి, కల్తీ మహమ్మారికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.




