13 March, 2026 | 1:44 AM

నత్తనడకన పల్లె దవాఖాన పనులు

13-03-2026 12:15 AM

నిజామాబాద్ జిల్లాలోని బడా భీమ్గల్‌లో ప్రారంభించిన పల్లె దవాఖాన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఐదేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఐదేళ్ల కింద పల్లె దవాఖాన పనులకు నేషనల్ హెల్త్ మిషన్ కింద రూ.16 లక్షలు మంజూరయ్యాయి.  కానీ, ఇప్పటికీ నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. గత ప్రభుత్వం 1000 మంది జనాభా ఉన్న గ్రామాల్లో పల్లె దవాఖాన ఏర్పాటు చేయాలని నిధులు మంజూరు చేసి, పనులకు టెండర్లు సైతం వేసింది.

బడా భీమ్గల్‌లో పల్లె దవాఖాన టెండర్ తీసు కున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పనులు నత్తనడకన నడుస్తున్నాయి. స్లాబ్ చుట్టూ గోడలు నిర్మించి మిగతా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. చుట్టుపక్కన పిచ్చిమొక్కలు పెరిగిపోయి మందు బాబులకు అడ్డాగా మారింది. గ్రామంలో సుమారు 3600 జనాభా ఉంది.

గర్భిణులు, బాలింతలకు వైద్య సేవలు అందించేందుకు ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఐదుగురు ఆశ వర్కర్లు ఉన్నారు. ప్రస్తుతం పాత పంచాయతీలో సేవలు అందిస్తున్నారు. దీంతో చికిత్స కోసం వచ్చే బాలింతలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. సర్కార్ చొరవ తీసుకుని దవాఖాన పనులు పూర్తి చేయించాలి.

 సురేశ్, బడా భీమ్గల్, నిజామాబాద్ జిల్లా