మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంత్రి కిషన్ రెడ్డి భేటీ.. పట్టణాభివృద్ధిపై చర్చ
న్యూఢిల్లీ: కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కొనసాగుతున్న కీలక ప్రాజెక్టులను సమీక్షించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిశారు. పట్టణ మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, ప్రజా రవాణా అంశాలపై ఇరువురు మంత్రులు కూలంకషంగా చర్చించారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టు అంశం గురించి మంత్రితో చర్చించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
ఈ ప్రాజెక్టు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎల్&టీ నుండి స్వీకరించిన నేపథ్యంలో 162 కిలో మీటర్ల మెట్రో రెండోదశ విస్తరణకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR), ఇతర సాంకేతిక వివరాలు అందిన వెంటనే వాటిని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకుంటామని ఖట్టర్ చెప్పారని అన్నారు. రెండో దశ విస్తరణపై కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని, ఇందుకు అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో సమానంగా పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో హైదరాబాద్‌లో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, ప్రజారవాణాలపై చర్చించామని, అలాగే మూసీ నది సుందరీకరణకు సంబంధించిన చర్యలపైనా చర్చ జరిగింది. మూసీ పారిశుద్ధ్యంపై కీలక వివరాలను మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారని, అమృత్ 2.0 పథకం కింద మూసీ నది ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటామన్నారు. నదిలోకి ప్రవహించే మురుగునీటిని శుద్ధి చేసేందుకు 39 ఎస్టీపీ లు మంజూరు చేస్తామని, ఎస్టీపీల ప్రాజెక్టు మొత్తం రూ.3,975 కోట్ల వ్యయంతో మురుగునీటి శుద్ధి కేంద్రాలను (STP) ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.






