3 May, 2026 | 6:02 PM

మంత్రి మనసు వెన్న.. స్పందన మెరుపు తీగ!

03-05-2026 04:44 PM

- ఎడమ కాలు లేని ఓ మహిళకు 'పొంగులేటి' అభయం.. 120 నిమిషాల్లోనే అందిన వీల్ ఛైర్!

- ప్రజా దర్బార్‌లో బాధితురాలికి అండగా నిలిచిన మంత్రి.. క్షేత్రస్థాయిలో సత్వర పరిష్కారం!

కూసుమంచి,(విజయక్రాంతి): అధికారం అంటే ఆజ్ఞాపించడం కాదు.. ఆపదలో ఉన్నవారి కన్నీరు తుడవడమేనని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరోసారి నిరూపించారు. సామాన్యుల సమస్యలను నేరుగా వినేందుకు ఆయన నిర్వహిస్తున్న 'ప్రజా దర్బార్' ఒక నిరుపేద మహిళ జీవితంలో కొత్త వెలుగులు నింపింది. ఎడమ కాలు లేక, కనీసం అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్న ఓ బాధితురాలి ఆవేదన చూసి చలించిన మంత్రి.. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఆమెకు ఊతమిచ్చారు.

- కదిలించిన దీనగాథ

మండలంలోని గట్టుసింగారం గ్రామానికి చెందిన షేక్ షకీనా అనే మహిళకు ఎడమ కాలు లేదు. నడవలేక, తన పనులు తాను చేసుకోలేక నిత్యం నరకయాతన పడుతున్న ఆమె, ఆశగా ప్రజా దర్బార్‌కు చేరుకుంది. తన దీనస్థితిని మంత్రి పొంగులేటికి వివరిస్తూ.. "అయ్యా.. నా కాలు లేక బతుకు భారమైంది.. ఒక చక్రాల కుర్చీ ఉంటే ఎవరి మీద ఆధారపడకుండా నా పనులు నేను చేసుకుంటాను" అని వేడుకుంది. ఆ మహిళ ఆర్తిని చూసిన మంత్రి మనసు వెన్నలా కరిగిపోయింది. "అమ్మా.. దిగులు పడకు, నేనున్నాను" అని భరోసా ఇచ్చారు.

- మెరుపు వేగంతో భరోసా

మంత్రి ఆదేశం మెరుపు తీగలా పనిచేసింది. విన్నపం అందిన కేవలం 120 నిమిషాల్లోనే అధికారులు కొత్త వీల్ ఛైర్‌ను సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో మంత్రి పొంగులేటి స్వయంగా ఆమె పక్కన నిలబడి, ఆత్మీయంగా పలకరిస్తూ వీల్ ఛైర్‌ను అందజేశారు. సమస్య చెప్పిన కొద్దిసేపటికే పరిష్కారం లభించడంతో ఆ మహిళ కళ్లలో మెరిసిన ఆనంద బాష్పాలే పొంగులేటి ప్రజా పాలనకు నిదర్శనంగా నిలిచాయి.

- సర్వత్రా హర్షం

తక్షణమే స్పందించి తనకు అండగా నిలిచిన మంత్రికి షకీనా మనసారా కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గవ్యాప్తంగా  ప్రజా దర్బార్‌లు నిర్వహిస్తూ, ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్తున్న మంత్రి పొంగులేటి తీరుపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతోంది.