18 July, 2026 | 12:12 PM

Breaking News

విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •   సోనమ్ వాంగ్‎చుక్ దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు   •  

ధాన్యం కొనుగోళ్లలో మంత్రి పొన్నం విఫలం

19-05-2026 12:00 AM
  1. మంత్రిగా నియోజకవర్గ రైతులకు చేసింది ఏమీ లేదు 
  2. ధాన్యం కొనుగోళ్లపై కనీసం రివ్యూ చేయకపోవడం విడ్డూరం 
  3. వడ్లు,మక్కలు, సన్ఫ్లవర్ తక్షణమే కొనుగోలు చేయాలి 
  4. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్

భీమదేవరపల్లి, మే 18 (విజయక్రాంతి):  హుస్నాబాద్ నియోజకవర్గంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయించడంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఘోరంగా విఫలమయ్యాడని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ మండలం తోపాటు భీమదేవరపల్లి లో పలు గ్రామాలు, పందిళ్ళ గ్రామ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర పారాబాయిల్ మిల్లుతోపాటు సమీపంలోని పలు రైస్ మిల్లులను ఆయన సందర్శించి ధాన్యం నిలువలు, కొనుగోళ్లపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ హుస్నాబాద్ లో ఎన్నో మార్పులు చేస్తానని, ఇది ప్రజా ప్రభుత్వమని, రైతు ప్రభుత్వం అని నిరంతరం ప్రకటనలు చేసే మంత్రి నియోజకవర్గంలో జరుగుతున్న ధాన్యం, మక్కలు, పొద్దు తిరుగుడు కొనుగోళ్లపై ఇప్పటివరకు కనీసం జిల్లా స్థాయి అధికారులతో రివ్యూ నిర్వహించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఎన్నడు కూడా తమ పంటను విక్రయించడంలో ఇబ్బందులు పడలేదన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి చెందుతుందన్నారు. గతేడాది ధాన్యం నిలువలే రైస్ మిల్లులో ఉన్నందున ప్రస్తుతం కొనుగోలు జరగడం లేదన్నారు.

మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ మిల్లుల్లో ఉన్న పాత స్టాకును ఖాళీ చేయించడంలో నిర్లక్ష్యం చేయడం వల్లే కొత్త స్టాకును మిల్లు యజమానులు తీసుకోలేకపోతున్నారని అన్నారు. ఒక మంత్రి ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గం లోని రైతులే ఇంత ఇబ్బందులకు గురవుతున్నారంటే సాధారణ నియోజకవర్గాల్లో రైతుల పరిస్థితి ఏమిటో అర్థమవుతుందన్నారు.

వెంటనే మంత్రి పొన్నం స్పందించి జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో రివ్యూ నిర్వహించి హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు జిల్లాలో వడ్లు, మక్కలు, పొద్దు తిరుగుడు పంటలను వెంటనే కొనుగోలు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. రోహిణి కార్తె సమీపిస్తున్నదని, వానాకాలం పనులకు సన్నద్ధమవుతున్న రైతులకు ఇంకా వడ్లు అమ్ముకునే పరిస్థితి లేకపోవడం దారుణం అన్నారు. వెంటనే స్పందించి కొనుగోలు వేగవంతం చేయకుంటే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.