ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణి
హైదరాబాద్: ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణి కార్యక్రమానికి మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ తో కలిసి హాజరయ్యారు. ఏటూరు నాగారం మండలానికి చెందిన 38 మంది లబ్ధిదారులకు, కొండాయి గ్రామానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని, పేదవాడి కలను సాకారం చేయడానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. మంజూరు చేసిన ఇండ్లను లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణం పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, డీపీఓ వెంకయ్య, హౌసింగ్ పీడీ ఎస్.సూర్య నారాయణ, ఎంపీడీవో శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




