3 May, 2026 | 1:33 AM

వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నూతన చట్టాన్ని ఆమోదించాలి

16-09-2025 02:10 PM

హైదరాబాద్: కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్(Minister Anupriya Patel)తో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రబీ సీజన్ లో ఏర్పడిన యూరియా లోటును ఇబ్బంది లేకుండా వెంటనే భర్తీ చేయాలని మంత్రి తుమ్మల కోరారు. అలాగే ఈ నెలలోనే 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి ఇవ్వాలని మంత్రి అనుప్రియ పటేల్ ను కోరారు. మంత్రి అనుప్రియ పటేల్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ కారణాల వల్లనే యూరియా సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా రాష్ట్రానికి యూరియా సరఫరా చేస్తామని మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించారు.

అనంతరం మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడుతూ.. రైతులను కాపాడే విషయంలో కొన్ని చర్చలు జరిగాయని.. 1968లో చేసిన విత్తన చట్టానికి మార్పులు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నూతన చట్టాన్ని ఆమోదించాలని, అలాగే దేశంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు దిగుమతిపై సుంకాలు పెంచాలని కోరామని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, యూరియా విషయంలో రైతులకు వచ్చిన ఇబ్బందులను కూడా ప్రస్తావించామని తెలిపారు. అధికంగా దిగుమతులపై ఆధారపడినందున ఇబ్బందులు వస్తున్నాయని, ఈ వానాకాలం పంటలకు ఇంకా 2 లక్షల టన్నుల యూరియా రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉందన్నారు. కొత్తగూడెం విమానాశ్రయం గురించి కూడా కేంద్రమంత్రితో చర్చించానని మంత్రి తుమ్మల తెలిపారు.