17 May, 2026 | 11:38 AM

ధాన్యం రాశికి నిప్పంటించిన దుండగులు

17-05-2026 10:32 AM

- 5వేల గన్ని బ్యాగులు దగ్ధం

- తప్పిన పెను ప్రమాదం 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు,రైతులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బొల్లంపల్లి గ్రామంలో ఇటీవల ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి గ్రామానికి చెందిన రైతు అంకిరెడ్డి మురళి సుమారు లారీ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసి, తూర్పార బట్టి విక్రయానికి సిద్ధం చేశాడు. శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ధాన్యం రాశికి నిప్పు పెట్టగా అదృష్టం కొద్దీ గాలి దిశ మారి పక్కనే ఉన్న గన్నీ బ్యాగులకు అంటుకుంది.

దీంతో సుమారు 5వేల గన్ని బ్యాగులు దగ్ధమైనట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న రైతుల ధాన్యం రాశులకు పెద్ద ప్రమాదం తప్పిందని రైతులు,గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. మంటలను గమనించిన గ్రామస్తులు వెంటనే డయల్ 100, ఫైరింజన్ కు ఫోన్ చేయగా గ్రామస్తులు, ఫైర్ సిబ్బంది కలిసి మంటలను అదుపు చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా రైతు అంకిరెడ్డి మురళి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

రాజకీయ కుట్రలో భాగంగా ఈ దుచ్చర్యకు పాల్పడ్డారా.. లేక ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న జాప్యానికి నిరసనగా ఆగ్రహంతో ఈ సంఘటనకు పాల్పడ్డారా అని పలువురు చర్చించుకుంటున్నారు. విషయం తెలిసిన సూర్యాపేట ఆర్డీవో వేణు మాధవరావు,తహసీల్దార్ శ్రీకాంత్,ఎస్ఐ సైదులు సంఘటన స్థలిని పరిశీలించారు. జరిగిన సంఘటనపై ఐకేపీ నిర్వాహకులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.