30 August, 2026 | 3:16 PM

స్టాలిన్‌కు భద్రత కుదింపు

30-08-2026 02:12 PM

చెన్నై: భద్రత కల్పించబడిన రాజకీయ నాయకులకు ఉన్న ముప్పుపై క్రమం తప్పకుండా జరిపే సమీక్షలో భాగంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్‌కు(MK Stalin Security Cover Downgraded) కల్పిస్తున్న భద్రతను 'Z+' స్థాయి నుండి 'Z' స్థాయికి తగ్గించినట్లు అధికారులు తెలిపారు. 58 నుంచి 33కి స్టాలిన్ భద్రతా సిబ్బంది కుదించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర సచివాలయంలోని 'కోర్ సెల్ సెక్యూరిటీ వింగ్' జరిపిన సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. నిఘా సమాచారం స్టాలిన్ భద్రతా అవసరాలను పరిశీలించే ఈ ప్రక్రియలో ప్రధాన కార్యదర్శి సాయి కుమార్, హోం శాఖ కార్యదర్శి కె. మణివాసన్, డీజీపీ మహేష్ కుమార్ అగర్వాల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సవరించిన ఏర్పాట్ల ప్రకారం, స్టాలిన్‌కు భారీ పోలీసు భద్రత కల్పించడం కొనసాగుతుంది. ఆయన కాన్వాయ్‌లోని ముందు, మధ్, వెనుక భాగాలలో భద్రతా బృందాలను మోహరిస్తారు. ప్రయాణం, బహిరంగ కార్యక్రమాల్లో ఆయనకు రక్షణ కల్పించేందుకు పైలట్, ఎస్కార్ట్, బ్యాకప్, క్లోజ్-ప్రొటెక్షన్ వాహనాలు ఈ కాన్వాయ్‌లో ఉంటాయి.

ఈ మార్పును భద్రతను ఉపసంహరించుకోవడంగా కాకుండా, సిబ్బంది మోహరింపును హేతుబద్ధీకరించడంగా అధికారులు అభివర్ణించారు. తమిళనాడులో వీఐపీలు, వీవీఐపీలకు అందించే భద్రతను ప్రతి ఆరు నెలలకు ఒకసారి పునఃసమీక్షిస్తారు. ఈ ప్రక్రియలో నిఘా నివేదికలు, ముప్పుల స్వభావం, తక్షణ తీవ్రత, ప్రజల్లోకి వెళ్లడం, ప్రయాణ సరళి  రక్షణ అవసరాలను పరిగణనలోకి తీసుకుంటారు. "మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌కు కల్పించిన 'Z+' స్థాయి భద్రతలో సిబ్బంది సంఖ్యను తగ్గించడం సరికాదు. ఇప్పటివరకు ఆయనకు కల్పించిన భద్రతా ఏర్పాట్లు ఎటువంటి మార్పులూ లేకుండా కొనసాగాలి. తమిళనాడు ప్రభుత్వం ఆయన కోసం తక్షణమే అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి" అని VCK అధ్యక్షుడు తోల్. తిరుమావళవన్ మీడియాతో పేర్కొన్నారు.