నేపాల్-టిబెట్ వరదల్లో ఇప్పటివరకు 682 మంది మృతి
ఖాట్మండు: నేపాల్‌లో(Nepal Flash Flood) సంభవించిన వరద విపత్తులో కనీసం 682 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 3,000 మంది ఆచూకీ ఇంకా తెలియలేదని అధికారులు తెలిపారు. శిథిలాల మధ్య, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు 4,451 మందిని రక్షించినట్లు ప్రధాన మంత్రి తెలిపారు. అదే సమయంలో మానవతా సహాయం అవసరం పెరుగుతూనే ఉంది. వేలాది మంది పిల్లలకు అత్యవసర సహాయం అవసరమని యూనిసెఫ్ (UNICEF) హెచ్చరించగా, తాత్కాలిక శిబిరాల్లో ఉన్న బాధితులకు అంతర్జాతీయ సహాయం అందడం ప్రారంభమైంది. కనీసం 17,000 మంది పిల్లలకు అత్యవసర మానవతా సహాయం అవసరమని యూనిసెఫ్ హెచ్చరించింది.
వరదల కారణంగా 18 పాఠశాలలు పూర్తిగా ధ్వంసమవ్వగా, మరో 20 పాఠశాలలు దెబ్బతిన్నాయి. దీనివల్ల ప్రభావిత ప్రాంతాల్లోని వేలాది మంది విద్యార్థుల చదువుకు అంతరాయం కలిగింది. ఈ విపత్తు వల్ల కనీసం 93,000 మంది ప్రభావితమయ్యారని అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ అంచనా వేసింది. టిబెట్‌లో చిక్కుకున్న 120 మంది భారతీయులను మరోమార్గం ద్వారా నేపాల్‌కు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. నేపాల్- టిబెట్ మధ్య ఉన్న ప్రధాన సరిహద్దు మార్గాలలో ఒకటైన గ్యిరోంగ్ పోర్ట్ వద్ద ఆగస్టు 26న సంభవించిన భారీ ఆకస్మిక వరద తర్వాత, 49 మంది భారతీయులతో సహా మొత్తం 261 మంది విదేశీయుల ఆచూకీ తెలియరాలేదని చైనా అధికారులు ఆదివారం తెలిపారు. గిరోంగ్‌లో జరిగిన మీడియా సమావేశంలో చైనా అధికారులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.






