యాప్‌లతో అన్నదాతకు అగచాట్లు!
సకాలంలో యూరియా అందక పంటలపై రైతుల ఆందోళన
యాప్ విధానాన్ని సరళీకరించాలి
పాత పద్ధతిలోనే ఎరువులు పంపిణీ చేయాలి
కోనరావుపేట ఆగష్టు 30 (విజయక్రాంతి): యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని గొల్లపల్లి–కొలనూర్ గ్రామ సర్పంచ్ బొజ్జం మల్లేశం డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న యాప్ ఆధారిత ఎరువుల పంపిణీ విధానం రైతులను తీవ్ర అయోమయానికి గురిచేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మండలానికి పరిమితంగా యూరియా కేటాయిస్తుండటంతో రైతులు బుకింగ్ కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు.యాప్‌లో బుకింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే స్టాక్ పూర్తయినట్లు చూపిస్తుండటంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని తెలిపారు.
ముఖ్యంగా యాప్ వినియోగంపై అవగాహన లేని రైతులు బుకింగ్ చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పంటకు అత్యవసరమైన సమయంలో యూరియా అందకపోతే రైతు తన పంటను ఎలా కాపాడుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని యాప్ విధానాన్ని సరళీకరించడంతో పాటు, అవసరమైతే గతంలో మాదిరిగానే నేరుగా రైతులకు యూరియా, ఇతర ఎరువులు అందించే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సాంకేతిక సమస్యలతో రైతులను ఇబ్బంది పెట్టకుండా సులభమైన విధానంలో, పంటలకు అవసరమైన సమయంలోనే ఎరువులు అందేలా అధికారులు, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సర్పంచ్ బొజ్జం మల్లేశం కోరారు.






