29 March, 2026 | 7:38 PM

రెండు పంటలకు నీరందించే బాధ్యత నాది!

04-05-2024 12:05 AM

భూకబ్జాకోరు బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేష్

స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

వరంగల్, మే 3(విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికలు పూర్తవగానే శ్రీరాంసాగర్, దేవాదుల కాల్వల ద్వారా ఏటా రెండు పంటలకు సాగునీరు అందించే బాధ్యత తనదేనని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. హసన్‌పర్తి మండలం ఎర్రగట్టుగుట్టలో శుక్రవారం నిర్వహించిన పార్టీ బూత్ కమీటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. మడికొండ డంపింగ్ యార్డు విషయంలో తనపై కావాలని కొందరు 0దుష్ప్రచారం చేస్తున్నారని, జనవాసాలకు దూరంగా తాను డంపింగ్ యార్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధమవుతుందన్నారు. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీలేదన్నారు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి ఆరూరి రమేష్ మండలానికో గెస్ట్ హౌజ్ కట్టుకున్నాడని ఆరోపించారు.  ల్యాండ్ పూలింగ్ పేరుతో ఓఆర్‌ఆర్ చుట్టూ రైతుల భూములను ఆక్రమించారన్నారు. భూకబ్జాలపై దృష్టి పెట్టడంతో ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు సరైన బుద్ధి చెప్పారన్నారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడాయన బీజేపీలో చేరారని, పైగా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారన్నారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే మత విద్వేషాలు పెరుగుతాయన్నారు. సామాన్యులు జీవించే పరిస్థితి లేకుండా పోతుందన్నారు. సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నాయకులు దొమ్మటి సాంబయ్య, పెరుమాండ్ల రామకృష్ణ, కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.