30 July, 2026 | 7:00 PM

టేకులపల్లిలో SIR కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

30-07-2026 05:57 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision) కార్యక్రమం అమలును ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గురువారం పరిశీలించారు. ఆయనతో కలిసి ఇల్లందు నియోజకవర్గ ఇన్‌చార్జి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరావు పలు గ్రామ పంచాయతీల్లో పర్యటించారు. బోడు, రామచంద్రుపేట, కొప్పురాయి, ఎర్రాయిగూడెం గ్రామ పంచాయతీలలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు.

కొత్త ఓటర్ల నమోదు, పేర్ల సవరణలు, చేర్పులు, తొలగింపులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పూర్తి పారదర్శకతతో నిబంధనల ప్రకారం SIR కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం BLOలు, BLAలతో సమావేశమై గ్రామాల వారీగా కార్యక్రమ పురోగతిపై నివేదికను స్వీకరించారు.

పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లక్కినేని శ్యామ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, జిల్లా కాంగ్రెస్ నాయకుడు కోరం సురేందర్, ఆత్మ కమిటీ చైర్మన్ మంగీలాల్, సర్పంచులు వాసం సువర్ణ, చింత కళ్యాణ్, పోదేం స్వరూప, ఊకె రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, BLOలు, BLAలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.