11-02-2026 01:26:26 PM
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా గౌరవ మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వారి సతీమణి యెన్నం ప్రసన్న తో కలిసి నగరంలోని పద్మావతి కాలనీలో ఉన్న ప్రతిభా జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నెం.96లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌గా అభివృద్ధి చెందిన తరువాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు కావున, మనకు ఏ నాయకుడి వలన అభివృద్ధి పనులు జరుగుతాయో గమనించి, ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు.
ఎన్నికలు ఈ రోజు వరకు మాత్రమే ఉంటాయని, రేపటి నుండి అందరం అన్నదమ్ముల్లా, ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి ఉండాలని అన్నారు. రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల సమయంలో ఎటువంటి ఉద్రిక్తతలు, ఘర్షణలకు చోటు ఇవ్వకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనదని పేర్కొంటూ, ప్రజాస్వామ్యాన్ని బలపర్చే ఈ పవిత్రమైన హక్కును ప్రతి ఓటరు బాధ్యతగా భావించి తమ ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహా రెడ్డి, 22వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ప్రవీణ, నాయకులు రఘురామిరెడ్డి, రామేశ్వర్ రెడ్డి, రమేష్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.