4 August, 2026 | 4:59 AM

ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశే

21-05-2024 12:55 AM

జూన్ 3 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

న్యూఢిల్లీ, మే 20: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టు జూన్ 3వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఈ కుంభకోణంలో సీబీఐ నమోదు చేసిన కేసులో ఆమెకు రౌస్ అవెన్యూ కోర్టు గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ సోమవారంతో ముగియటంతో, కస్టడీని పొడిగించాలని దర్యాప్తు సంస్థ కోరింది. ఈ కేసులో అనుబంధ చార్జిషీట్‌ను కూడా దాఖలు చేసింది. సీబీఐ వాదనను కవిత తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు.

దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత నిందితురాలిని ఇంకా జైల్లో ఉంచాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నించారు. అయితే, దర్యాప్తు ఇంకా పూర్తికాలేదని, ఈ పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ కోరింది. దీంతో కోర్టు ఆమె జ్యుడీషియల్ కస్టడీని జూన్ 3వ తేదీ వరకు పొడిగించింది. మరోవైపు ఢిల్లీ హైకోర్టులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సీబీఐ తనను అరెస్టు చేయటాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం సీబీఐకి నోటీసులు జారీచేసింది. కౌంటర్ దాఖలుచేయాలని ఆదేశించింది. ఈ కేసును ఈ నెల 24న మరోసారి విచారిస్తామని ప్రకటించింది.