4 August, 2026 | 6:07 AM

తారలు రాలినవేళ!

20-05-2024 02:39 AM

స్పెయిన్, పోర్చుగల్ గగనంలో అద్భుతం

ఉల్కాపాతంతో మెరిసిపోయిన ఆకాశం

పట్టపగలుగా మారిపోయిన అర్ధరాత్రి

చుక్కలు మీదపడుతాయా అన్నంత ఉత్కంఠ

ఈ ఉల్కాపాతం సాధారణమే: నాసా

న్యూఢిల్లీ, మే 19: అర్ధరాత్రి కటిక చీకటివేళ ఆకాశం పట్టపగలుగా మారిపోయింది. దట్టమైన మేఘాలు కమ్మినట్టుగా పొగతో నిండిపోయింది. ఆ పొగమేఘాలను చీల్చుకుంటూ దూసుకొస్తున్న అగ్నిగోళాలు భీకర యుద్ధ క్షేత్రంలో భయంకర క్షిపణుల్లా కనిపించాయి. శనివారం రాత్రి స్పెయిన్, పోర్చుగల్ గగనతలాల్లో కనిపించిన ఉల్కాపాతం ఇది.

మిన్నువిరిగి మీద పడుతుందా అన్నట్టుగా ఆవిష్కృతమైన ఈ దృశ్యాన్ని చూసి స్థానికుల్లో ఆశ్చర్యం, భయం, భీతి, ఆనందం ఏకకాలంలో కలిగాయి. దూసుకొస్తున్న అగ్నిగోళాలను చూసి కొందరు కేరింతలు కొడితే.. మరికొందరు భయంతో బిక్కచచ్చిపోయారు. చాలామంది ఆ దృశ్యాలను వీడియోలు తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్‌గా మారాయి. క్యాస్ట్రో డైర్, పిన్‌హీరో ప్రాంతాల్లో ఈ ఉల్కాపాతం కనిపించింది. 

అసాధారణ దృశ్యం

సాధారణంగా ఉల్కాపాతం అంటే ఒకటోరెండో ఉల్కలు భూ వాతావరణంలోకి ప్రవేశించగానే మండుతూ దూసుకుపోయి అంతర్దానం అవుతాయి. అవికూడా చాలా ఎత్తులోనే మండిపోతాయి. కానీ శనివారం సంభవించిన ఉల్కాపాతం భూమికి అతి సమీపంలోకి దూసుకొచ్చింది. దశాబ్దం క్రితం వచ్చిన హాలీవుడ్ సినిమా 2012లోని సీన్లను చూస్తున్నామా అన్నంత అనుభూతి కలిగింది.

అయితే, ఉల్కల శకలాలేవీ భూమిని తాకలేదని అధికారులు తెలిపారు. ఎక్కడా ఉల్కల శకలాలు లభించలేదని, ఉల్కలు భూమిని తాకితే ఏర్పడే బిలాలు కూడా ఎక్కడా కనిపించలేదని చెప్పారు. ‘అబ్బా.. అద్భుతం.. ఎంత కాంతిమంతంగా ఉన్నది! మెగ్నీషియం మండుతున్నట్టుగా ఉన్నది’ అని ఓ ప్రత్యక్ష సాక్షి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఒకే నెలలో అరోరా బొరియాలిస్ (ఇటీవల సౌర తుఫాను వల్ల ఏర్పడింది), ఉల్కాపాతం, సూర్యగ్రహణం.. ఏమిటీ వింత? ఇది దేనికి సంకేతం? అని మరొకరు ఆందోళన వ్యక్తంచేశారు.

ఇది సాధారణమే: నాసా

భీకర ఉల్కాపాతంపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా స్పందించింది. ఇది నిత్యం జరిగేదని, ప్రమాదం ఏమీ లేదని పేర్కొన్నది. భూమి వాతావరణంలోకి రోజూ సగటున 44 వేల కిలోల అంతరిక్ష శిలలు దూసుకొస్తాయని తెలిపింది. సాధారణంగా అవన్నీ భూ వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోతాయని, కొన్ని సార్లు మాత్రమే ఇలా బాంబుల్లా దూసుకొస్తాయని పేర్కొన్నది. ఇలా మండుతూ వచ్చే ఉల్కలను షూటింగ్ స్టార్స్ అంటారని తెలిపింది. తోకచుక్కల తోకభాగంలోని ధూళిలో ఉండే రాళ్లే భూమిపైకి దూసుకొస్తాయని వివరించింది.