సీఎంఆర్ఎఫ్ ఆపద్బాంధవుడు కేసీఆర్

16-09-2026 | 05:02pm

నేడు అగమ్యగోచరంగా కాంగ్రెస్ పరిపాలన

చెక్కులను అందజేసిన బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్

ఖమ్మం,(విజయక్రాంతి): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని, పేదల ప్రాణాలు నిలిపే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులకు(CMRF cheques) సైతం పరిమితులు (సీలింగ్) విధించి తీవ్ర అన్యాయం చేస్తోందని ఖమ్మం జిల్లా(Khammam District) బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్(MLC Tata Madhusudhan) మండిపడ్డారు. ​ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో తన సిఫారసుతో మంజూరైన రూ. 15,48,500 విలువ చేసే 72 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన స్వయంగా అందజేశారు.​

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ, కేసీఆర్ హయాంలో ఏటా ప్రభుత్వ బడ్జెట్ నుంచి రూ. 2,000 కోట్లను కేటాయించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేదలకు రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఎల్ఓసీలు, చెక్కులు అందించి ప్రాణాలు నిలబెట్టారని గుర్తుచేశారు. నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్‌పై సీలింగ్ పెట్టి తీవ్ర కోతలు విధిస్తోందని, చివరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలే సీఎం కార్యాలయానికి వెళ్లి దరఖాస్తులు సమర్పించలేక నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

​కేసీఆర్ పాలనలో ఇంట్లో కూర్చుని ఎరువుల బస్తాలు తెచ్చుకునే పరిస్థితి ఉండగా, నేడు యాప్‌లు, ఓటీపీల పేరిట రైతులను రోడ్లపై నిలబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్, ఎరువులు ఇవ్వలేకనే మోటార్లను ఆన్ చేయకుండా ప్రాజెక్టుల నీటిని విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 

మరిన్ని వార్తలు