విపత్తులపై ముగిసిన మాక్ ఎక్సర్‌సైజ్
నిశితంగా పర్యవేక్షణ జరిపిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి) : వరదలు, విపత్తులు సంభవించిన సమయాలలో చేపట్టాల్సిన తక్షణ చర్యలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల విషయంలో సన్నద్ధతను తెలుసుకునేందుకు వీలుగా సోమవారం నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన మాక్ ఎక్సర్ సైజ్ విజయవంతంగా కొనసాగింది. జిల్లా పాలనాధికారి టి.వినయ్ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో మూడు చోట్ల ఏకకాలంలో నిర్వహించిన కార్యక్రమాలు విపత్తుల నిర్వహణలో జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా సమాయత్తం అయి ఉందన్న విషయాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించాయి. విపత్తుల సమయాలలో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేలా మాక్ ఎక్సర్ సైజ్ ద్వారా చేపట్టిన సహాయక చర్యలు వాస్తవికతను మరిపించేలా చేశాయి.
అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తూ, విపత్తుల సమయాలలో ఏవిధంగా వ్యవహరించాలన్నది కళ్ళకు కట్టినట్టు ఆచరణాత్మక రూపంలో చేసి చూపించారు. డ్రోన్ లు, వాటర్ బోట్ లు, అంబులెన్స్ లు, అగ్నిమాపక శకటాలు, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చేపట్టిన సహాయక చర్యలు విపత్తుల నిర్వహణపై సన్నద్దతను చాటిచెబుతూ ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందింపజేశాయి. ఆయా శాఖల అధికారులతో పాటు ఎస్.డీ.ఆర్.ఎఫ్, ఎన్.సీ.సీ, ఆపదమిత్ర వాలంటీర్లు మాక్ డ్రిల్ విజయవంతానికి దోహదపడ్డారు.
తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మిగులు జలాలు నిలిచి ఉండే మంజీరా తీర ప్రాంతమైన బోధన్ మండలం హంగర్గ శివారుతో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ఆసుపత్రి రఘునాథ చెరువు వద్ద మూడు చోట్ల ఏకకాలంలో విపత్తుల నిర్వహణపై మాక్ ఎక్సర్ సైజ్ జరిపారు. హంగర్గ వద్ద జరిగిన కార్యక్రమాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. వరద జలాలు గ్రామాన్ని ముంచెత్తే ప్రమాదం తలెత్తిన సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, చేపట్టాల్సిన తక్షణ చర్యలను వాస్తవిక రూపంలో మాక్ ఎక్సర్ సైజ్ ద్వారా చేసి చూపించారు. మాక్ ఎక్సర్ సైజ్ కార్యక్రమాలలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






