22-12-2025 10:51:09 PM
నకిరేకల్‌లో మేనఅల్లుడు చేతిలో మామ హత్య
నకిరేకల్,(విజయక్రాంతి): జీతం డబ్బులు, కుటుంబ కలహాలు విషయమై జరిగిన గొడవ హత్యకు దారి తీసిన ఘటన నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో కలకలం రేపింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నకిరేకల్ తిప్పర్తి రోడ్డులో నివసిస్తున్న కోడిగుడ్ల వ్యాపారి యలగందుల వెంకన్న (50)ను అతని మేనఅల్లుడు గట్టు శ్రీకాంత్ దాడి చేసి హత్య చేసిన ఈ ఘటనలో వెంకన్న కుమారుడు రాకేశ్ (29) తీవ్రంగా గాయపడూ రాకేశ్ గత ఏడు నెలలుగా తన మేనబావ శ్రీకాంత్ వద్ద పాల వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీకాంత్ నకిరేకల్‌లో వీఎన్‌ఆర్ మిల్క్ షాప్ నిర్వహిస్తున్నాడు. డిసెంబర్ 21 రాత్రి షాప్ వద్ద మద్యం సేవించిన సమయంలో జీతం డబ్బుల విషయమై వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో శ్రీకాంత్ ఆగ్రహంతో పాల ట్రేతో వెంకన్న తలపై దాడి చేయగా ఆయన కుప్పకూలిపోయాడు. అడ్డుకెళ్లిన రాకేశ్‌పైనా దాడి చేయడంతో అతడికి తీవ్ర రక్తగాయమైంది. అనంతరం అక్కడే ఉన్న సిమెంట్ ఇటుకతో వెంకన్న తలపై కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.
గాయపడిన రాకేశ్‌ను తొలుత నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.