17 July, 2026 | 12:05 AM

22 వరకు మోస్తరు వర్షాలు

17-07-2026 12:05 AM

కొన్ని జిల్లాల్లో వేడి, తేమతో ఉక్కపోతకు అవకాశం

రాష్ట్రంపై వాయవ్య బంగాళాఖాతం అల్పపీడన ప్రభావం: ఐఎండీ

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): తెలంగాణలో 22వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని గురువారం వాతావరణ శాఖ (ఐఎండీ బేగంపేట్) వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో వేడి, తేమ కారణంగా ఉక్కపోత తీవ్రంగా ఉండే అవకాశముందని హెచ్చరించింది. గురువారం వాతావరణానికి సంబంధించిన ప్రకటన జారీ చేసింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై పడుతున్నట్లు తెలిపింది.

22 వరకు రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 40 కి.మీ. వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. జూలై 19 నుంచి 22 వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతులు, ప్రజలు వాతావరణ హెచ్చరికలు గమనించి పనులు నిర్వహించుకోవాలని పేర్కొంది. కాగా గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కొన్నిచోట్ల భారీగా దంచికొట్టగా, మరికొన్నిచోట్ల జల్లులు పడ్డాయి.