5 March, 2026 | 6:49 AM

మోదీ, అమిత్‌షా దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు

05-03-2026 02:00 AM

సంజయ్ కేంద్ర మంత్రి అనే హోదాను మర్చిపోతుండు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): రాహుల్‌గాంధీ ప్రధాని కావడమంటే దేశానికి గ్రహణం పట్టినట్లేనని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఖండించారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి అనే విషయం మరచి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.

ప్రధాని నరేంద్రమోదీ కూడా గుజరాత్‌కు పారచూట్ నాయకుడిగా వచ్చి సీఎం అయ్యారనే విషయం తెలుసుకోవలని ఆయన హితవు పలికారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ మోదీ, అమిత్‌షాలు బిల్లా రంగాలుగా మారి దేశాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థలుగా చేసి పాలిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో మీకు పాసు మార్కులు మాత్రమే వచ్చాయని, నితీష్‌కుమార్, చంద్రబాబునాయుడు లాంటి వారి వల్లే లేకుంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలుసుకోవాలన్నారు. 2009లో రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని మన్మోహన్‌సింగ్ లాంటి వారు కోరారని ఆయన గుర్తు చేశారు.

మోదీలాగ ఎన్నికల్లో గెలవకున్నా గుజరాత్‌కు సీఎం అయినట్లుగా..రాహుల్‌కు అవకాశం ఇచ్చినా ప్రధాని పదవీ తీసుకోలేదన్నారు. గత బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన లూటీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి తెలియదా..? ఆ లూటిని ఎందుకు ఆపలేదని ఎంపీ చామల నిలదీశారు. గుజరాత్‌లో సబర్మతి నదిని అభివృద్ది చేసినప్పుడు మేయర్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారున్నా.. మంచిపనికి కాంగ్రెస్ పార్టీ సహకరించిందని తెలిపారు. తెలంగాణలో మూసిని అభివృద్ధి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.