అయోమయంలో బీఆర్‌ఎస్ శ్రేణులు!
- మల్లారెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైతే తమ పరిస్థితి ఏంటని ఆందోళన..
- డ్రామా అని కొట్టి పారేస్తున్న మరికొందరు..
- బీజేపీలో అలజడి
- ‘విజయక్రాంతి’ కథనంపై తీవ్ర చర్చ
మేడ్చల్, జూన్ 11 (విజయక్రాంతి): మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో బిఆర్ఎస్ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. మల్లారెడ్డికి అనుచరులుగా ఉన్న నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటోనని ఆందోళన చెందుతున్నారు. తమ నాయకుడే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నందున తమ దారి తాము చూసుకోవాలన్న యోచనలో మరికొందరు ఉన్నారు.
మల్లారెడ్డి నిజంగానే ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవుతున్నారా? లేక ఇంకేమైనా కారణం ఉందా అని చర్చించుకుంటున్నారు. మల్లారెడ్డి రాజకీయాలనుండి తప్పుకుంటే పార్టీకి పెద్ద లోటు అవుతుందని అంటున్నారు. ఆర్థిక బలం, అంగ బలంతో పాటు వాక్చాతుర్యం ఉందని, ఇలాంటి నాయకుడు దొరకడం కష్టమని అంటున్నారు. మల్లారెడ్డి రాజకీయాల్లో కొనసాగాలని ఆయన అనుచరులు కోరుకుంటున్నారు. మల్లారెడ్డి నిర్ణయంపై కార్యకర్తల్లో, నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అది ఒక డ్రామా
ఎన్నికల్లో పోటీ చేయబోనని మల్లారెడ్డి కొంతమంది అనుచరులతో వ్యాఖ్యానించడం ఒక డ్రామా అని పార్టీలోని మరికొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు.’విజయ క్రాంతి’దినపత్రికలో ’ప్రత్యక్ష రాజకీయాలకు మల్లారెడ్డి దూరం’శీర్షికన కథనం రావడంతో పలువురు ఫోన్లు చేసి మాట్లాడారు. బిజెపితో కమిట్మెంట్ అయ్యారని, క్యాడర్ ను అయోమయానికి గురి చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.
నియోజకవర్గంలో బి ఆర్ ఎస్ బలంగా ఉందని, ఎవరు ఉన్నా, వెళ్లిపోయిన పార్టీకి నష్టం లేదని, అభ్యర్థి ఎవరైనా గెలుపొందుతారని స్పష్టం చేశారు. అలియాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ పదవి చేజారడానికి కారకులెవరో విచారణ చేయించాలని అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ డ్యామేజీ అయ్యేలా కొందరుకు టికెట్లు ఇచ్చారని అన్నారు. ఒక కుమారుడికి బిఆర్‌ఎస్ టికెట్, మరో కుమారుడికి బిజెపి టికెట్ ఎలా ఆశిస్తారని వారు ప్రశ్నించారు.
బిజెపిలో అలజడి
చిన్న కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతి రెడ్డి బిజెపిలో చేరే అవకాశం ఉందని మల్లారెడ్డి వ్యాఖ్యానించడంతో ఆ పార్టీలో అలజడి మొదలైంది. ప్రీతి రెడ్డి బిజెపి నుంచి మల్కాజిగిరి టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మల్కాజిగిరిలో బిజెపి సిట్టింగ్ ఎంపీ ఈటెల రాజేందర్ ఉన్నారు. రాష్ట్రస్థాయి అగ్ర నేతల్లో ఈటెల రాజేందర్ ఒకరు. ఈటెల రాజేందర్ ను కాదని టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది చర్చ జరుగుతోంది. రాష్ట్రస్థాయి నేతకి చెక్ పెడతారా అని బిజెపి కార్యకర్తలు రుస రుసలాడుతున్నారు.
చర్చనీయాంశమైన ‘విజయక్రాంతి’ కథనం..
’ప్రత్యక్ష రాజకీయాలకు మల్లారెడ్డి దూరం?’శీర్షికన 10 తేదీన’విజయక్రాంతి’దిన పత్రికలో కథనం ప్రచురితమైంది. తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, బి ఆర్ ఎస్ టికెట్ ఇస్తే పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి పోటీ చేస్తారని, చిన్న కుమారుడు బిజెపిలోకి వెళ్లే అవకాశం ఉందని మల్లారెడ్డి అనుచరులతో చెప్పిన విషయం’విజయ క్రాంతి’దినపత్రికలో ప్రచురితమైంది.
ఈ కథనం మేడ్చల్ నియోజకవర్గంలో పాటు జిల్లాలో అంశమైంది. అందరూ ఇదే విషయమే చర్చించుకున్నారు. ఒకరినొకరు ఫోన్లు చేసుకుని సమాచారం తెలుసుకున్నారు. మల్లారెడ్డి చెప్పిన వారికి ఫోన్లు చేశారు. బీ ఆర్ ఎస్ తో పాటు ఇతర పార్టీలోనూ చర్చ జరిగింది.






