12 June, 2026 | 1:20 AM

చివరి మజిలీ.. సమస్యల గజిబిజి..

12-06-2026 12:00 AM
  1. వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్న వైకుంఠధామం                   
  2. అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి స్థానికుల వేడుకోలు                   

జవహర్‌నగర్, జూన్ 11 (విజయక్రాంతి): గ్రామపంచాయతీ నుండి మున్సిపా లిటీ వరకు మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ వరకు కార్పొరేషన్ నుండి నేడు గ్రేటర్ లోకి పాలన పరిపాలన మారినా జవహర్ నగర్ లోని స్మశాన వాటికల సౌకర్యాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి.

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొ రేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ అంబేద్కర్ నగర్లోని మూడవ డివిజన్ కెఎన్‌ఆర్ కాలనీ, నాచారం ఫైర్విక్టింగ్ కాలనీవాసుల తలరాతలు మాత్రం మారడం లేదు. స్థానికంగా ఉన్న వైకుంఠధామం దుస్థితి పరిస్థితి స్థానికులకు నరకం చూపిస్తోంది. మూడు డివిజన్ల ప్రజలకు ఇదొక్కటే వైకుంఠ దామం కావడంతో స్థలం సరిపోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.        

మురుగు నీటితో నిండిన స్మశానవాటిక..                                

మూలికే నక్క మీద తాటి పండు పడ్డచందంగా అసలే డ్రైనేజీ లేక అవస్థలు పడు తుంటే వైకుంఠధామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో చుట్టుపక్కల కాలనీల నుంచి వచ్చే మురుగు నీరంతా వైకుంఠధామంలోకి చేరుతుంది. వర్షం వస్తే మోకాళ్ళ లోతు నీరు నిలిచిపోతుందనంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా మని స్థానికులు ఆపోతున్నారు. దీంతో వర్ష పు నీరు నిల్వ ఉండడంతో దుర్వాసన, దోమ ల బెడదతో కాలనీవాసులుఉండలేకపోతున్నారని స్థానికులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. తాగడానికి మంచినీరు, షెడ్లు, మరుగుదొడ్లు విద్యుత్ దీపాలు లేకపోవడంతో అందరూ అవస్థలు పడుతున్నారు.                        

కాంట్రాక్టర్లకు జేబులు నింపిన వైకుంఠధామాలు..

గత ప్రభుత్వం వైకుంఠధామాల కోసం కోట్ల రూపాయల ఖర్చు చేసిందని పనులు మాత్రం అసంపూర్తిగా మిగిలి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై మాజీ కార్పొరేటర్లకు మున్సిపల్ అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇకనై నా వెంటనే డ్రైనేజీ సమస్యను పరిష్కరించి షెడ్డు మంచినీటి వసతిని లైటింగ్ సౌకర్యాలను కల్పించాలని జనాభా దృష్ట్యా అదనపు వైకుంఠధామాలను మంజూరు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.     

చీకటి పడుతుందంటే భయం.. 

సాయంత్రం చీకటి పడిందంటే వైకుంఠధామం పక్కన వీధి లైట్లు లేకపోవడంతో భయంగా ఉంది. సౌకర్యాల లేమితో అపరిశుభ్ర పరిసరాలతో కుక్కలు పందుల స్త్వ్రర విహారంతో భయాన్ని కలిగిస్తున్నాయి.

 రవి చారి, కేఎన్‌ఆర్ కాలనీ 

త్వరలోనే సౌకర్యాలు మెరుగు..

వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్న అంబేద్కర్ నగర్ స్మశానవాటికలో వసతుల లేమిపై అధికారులకు విన్నవించాం. సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు. కాలనీవాసులు అందరం అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అధికారులు స్మశానవాటిక అభివృద్ధికి సానుకూలంగా స్పందించారు.   

 ఎర్రగుడ్ల వెంకటేశ్వర్లు,

డీఎస్‌ఎస్ అధ్యక్షులు,

నాచారం ఫైర్‌విక్టిమ్ కాలనీ

వెంటనే పరిశీలిస్తాం..

అంబేద్కర్ నగర్ స్మశానవాటికలో నోలకొన్న సమస్య మా దృష్టికి వచ్చింది. వైకుంఠధామం వద్ద డ్రైనేజీ సమస్య ఇతర మౌలిక వసతులపై సిబ్బందితో వెంటనే పరిశీలన చేయిస్తాం. స్థలం నిధులను సంబంధిత అధికారులకు నివేదిక పంపుతాం. 

జి.రామలింగం, కీసర సర్కిల్ డీసీ