గడ్కరీని ఓడించేందుకు మోదీ, షా కుట్ర
అజిత్ వర్గాన్ని ఓడించేందుకు షిండే పనిచేశారు
బీజేపీ మళ్లీ వస్తే యోగి పదవికి గండం
శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
దీటుగా తిప్పికొట్టిన కాషాయ పార్టీ
ముంబయి/నాగ్‌పూర్, మే 26: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని నాగ్‌పూర్‌లో ఓడించేందుకు ఆ పార్టీ కీలక నేతలే ప్రయత్నించారని శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఈ కుట్ర పన్ని కలిసి పనిచేశారని ఆరోపించారు. గడ్కరీని ఓడించడం సాధ్యం కాదనే విషయాన్ని గ్రహించి అయిష్టంగానే నాగ్‌పూర్ ప్రచారంలో ఫడణవీస్ పాల్గొన్నారని చెప్పుకొచ్చారు.
ఈ విషయాన్ని ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు నాగ్‌పూర్‌లో బహిరంగంగానే చర్చించుకుంటున్నాయని శివసేన (యూబీటీ) పత్రిక సామ్నాలో రాసిన వ్యాసంలో రౌత్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 25 నుంచి 30 కోట్లు ఖర్చు చేశారని రౌత్ ఆరోపించారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ అభ్యర్థులను ఓడించేందుకు షిండే యంత్రాంగం పనిచేసిందన్నారు. మరోవైపు బీజేపీ మళ్లీ అధికారంలో వస్తే ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రిగా తొలగిస్తారని పేర్కొన్నారు.
మీ కుట్రలపైనా రాయండి..
సంజయ్ రౌత్ ఆరోపణలను బీజేపీ దీటుగా తిప్పికొట్టింది. ఆ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే స్పందిస్తూ.. బీజేపీ ఓ పార్టీ కాదని, కుటుంబమని అన్నారు. మోదీ, షా, యోగి, గడ్కరీ కుటుంబ సభ్యుల్లాగా మెలుగుతారని పేర్కొన్నారు. తమ తొలి ప్రాధాన్యం దేశ ప్రయోజనాలేనని, ఆ తర్వాతే పార్టీ, ఇతర అంశాలని తెలియజేశారు. రౌత్‌కు తొలి ప్రాధాన్యం ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్‌పవార్ అని, ఆ తర్వాతే ఉద్ధవ్ థాకరే అని చురకలంటించారు.
ధైర్యముంటే 2019 ఎన్నికల్లో సంజయ్ ముఖ్యమంత్రి అయ్యేందుకు చేసిన కుట్రలపై వ్యాసం రాయాలని బవాంకులే సవాల్ విసిరారు. సంజయ్ వ్యాసంపై స్పందించిన నాగ్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి వికాస్ థాక్రే మాట్లాడుతూ.. ఎన్నికల్లో గడ్కరీ గెలుస్తారని రౌత్ ఎలా చెబుతున్నారు? ఆయన ఏమన్నా జోతిస్యుడా? అని ప్రశ్నించారు. గడ్కరీపై ఆయన ప్రేమను ఇంట్లోనే దాచుకుంటే బాగుంటుందని చురకలు అంటించారు. ఇలాంటి రాతలు రాస్తే మహావికాస్ అఘాడీకి నష్టం జరుగుతుందని హెచ్చరించారు.






