28 July, 2026 | 10:11 PM

బోట్స్‌వానాలో టీ కన్సల్ట్ సేవలు

27-05-2024 12:56 AM

ఒప్పందం చేసుకున్న డబ్ల్యూటీఐటీసీ

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): మొబైల్ యాప్ ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం వైద్యం, వ్యవసాయ సహకారం అందించే టీ కన్సల్ట్ సేవలను ఆఫ్రికా దేశమైన బోట్స్‌వానాలో ప్రారంభించినట్లు వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (డబ్ల్యూటీఐటీసీ) చైర్మన్ సందీప్ మక్తాలా తెలిపారు. డబ్ల్యూటీఐటీసీ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో టీ కన్సల్ట్ ద్వారా వైద్య సేవలు అందిస్తోందని ఆయన వివరించారు. బోట్స్‌వానా రాజధాని గబరోనలో ఆ దేశ ఆరోగ్యమంత్రి ఎడ్విన్ డికోలోటితో ఆదివారం ఒప్పందం చేసుకున్నారు. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అధ్యక్ష బాధ్యతలు కూడా తీసుకున్న డికోలోటిని ఈ సందర్భంగా సందీప్ అభినందించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ పరిశ్రమలతో అనుసంధానం అయ్యేందుకు బోట్స్‌వానా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని సందీప్ వెల్లడించారు.

టీ హబ్‌లో రూపొందించిన టీ కన్సల్ట్ ద్వారా రోగులను వైద్యులతో అనుసంధానం చేయడం, వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు సలహాలు, సూచనలు, హెల్త్ కేర్, ఫార్మా, లీగల్ తదితర రంగాల్లో సేవలు పొందేందుకు అవకాశం ఉందని బోట్స్‌వానా మంత్రికి సందీప్ వివరించారు. కరోనా సమయంలో 20 వేల మంది టీ కన్సల్ట్ యాప్ ద్వారా వైద్య సేవలు పొందినట్లు తెలిపారు. ఆఫ్రికాలో సాఫ్ట్‌వేర్ సేవలను అందించేందుకు తెలుగు ఐటీ కంపెనీలకు కూడా అవకాశాలు విస్తృతం చేసేందుకు కృషి చేస్తామని సందీప్ తెలిపారు. డబ్ల్యూటీఐటీసీ సభ్యులు ఈవీ శ్రీనివాస్, వెంకట్ తోటకూర, చల్లనగారి నరేంద్ర, తిరునహరి వంశీకృష్ణ, వైద్యులు నిరుపమ, ప్రవీణ్ గెగ్గిలి, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.